Skip to main content

వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

మహా మహోపాధ్యాయ, బహుభాషావేత్త, వేద వేదాంగవేత్త, రాష్ట్రపతి సన్మాన విభూషిత, శతాధిక గ్రంథకర్త, ప్రాచీన వాఙ్మయ వ్యాఖ్యత పెదపాటి నాగేశ్వరరావు సహస్ర పూర్ణ చంద్ర దర్శన మహోత్సవం చూడముచ్చటగా ముగిసింది. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పెదపాటి వేయి పున్నముల దర్శన మహోత్సవానికి తెలంగాణ మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజు ఘట్టం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సంప్రదాయబద్ధంగా జరిగింది. 1941లో గుంటూరు జిల్లాలో జన్మించిన పెదపాటి.. ఆనాడు ఉన్న అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదురీది.. భాషలో, వేదాధ్యయనంలో, శిల్పశాస్త్రంలో ఎంతో కృషి చేశారని మధుసూూదనచారి కొనియాడారు. ఈనాటి యువకులను చదివించడానికి, అన్ని అవసరాలూ సమకూర్చడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నా పిల్లలు మాత్రం ఓ లక్ష్యం అంటూ లేకుండా ఉన్నారని ఆవేదన చెందారు. అందుకు భిన్నంగా పెదపాటి నాగేశ్వరరావు.. అననుకూల పరిస్థితులను అధిగమించి మహా పండితుడై కేవలం విశ్వబ్రాహ్మణ కులస్తులు మాత్రమే గాక యావత్ తెలుగుజాతి గర్వించే స్థాయికి ఎదిగారన్నారు. 

అలాంటి మహా పండితుడికి తగిన గుర్తింపు రాకపోవడం కాస్త చింతించాల్సిన విషయమేనని, అందుకు ఎవరినో నిందించడం కాకుండా.. మనల్ని మనం అర్థం చేసుకొని, మన శక్తియుక్తుల స్థాయేంటో తెలుసుకొని ఎదగడానికి ప్రయత్నించాలని నర్మగర్భంగా విశ్వబ్రాహ్మణులకు హితవు పలికారు. తన అవగాహన ప్రకారం మానవజాతిలో 4 రకాలైన మనుషులుంటారన్నారు మధుసూదనాచారి. 1) క్రియేటర్స్ (సృష్టికర్తలు లేదా సృజనకారులు), 2) ఇమిటేటర్స్ (అనుకరించేవారు), 3) స్పెక్టేటర్స్ (ప్రేక్షకులు), 4) ఫ్రస్టేటర్స్ (అసహనపరులు). ఈ నాలుగు రకాల మనుషుల్లో విశ్వబ్రాహ్మణులు మొదటి తరగతికి చెందినవారని, అది ప్రపంచానికి కూడా తెలుసని.. కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించడంలోనే విశ్వబ్రాహ్మణులు విఫలమవుతున్నారన్నారు. పెదపాటి లాంటి మహా పండితుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగానైనా.. విశ్వబ్రాహ్మణ  యువతీ యువకులు ఈ విషయం గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు కూడా తమ సంతానాన్ని ఆ విధంగా ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వబ్రాహ్మణులకు ఇచ్చినన్ని అవకాశాలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదన్నారు. నాగేశ్వరరావు, గంగాదేవి దంపతులకు మధుసూదనాచారి జంటగా శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి సన్మానించారు. 
వందకు పైగా పుస్తకాలు ప్రచురించిన పెదపాటి సాహితీ సేద్యాన్ని గురించి ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి కూలంకషంగా వివరించారు. మల్లినాథుని సూరి భాష్యమే లేకపోతే కాళిదాసు కవిత్వంలోని గొప్పదనం ప్రపంచానికి తెలిసేది కాదని.. అలంటి మల్లినాధుని సూరి కూడా పట్టుకోలేకపోయిన అంశాలను పెదపాటి నాగేశ్వరరావు నేటిి తరానికి అందించారన్నారు. సంస్కృతంలో ఉన్న విశ్వకర్మ పురాణాన్ని తేట తెలుగులోకి అనువదించారని, వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలోని వైశిష్ట్యం ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో దాన్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేశారన్నారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, తమిళం, కన్నడం, మరాఠా వంటి అనేక భాషల్లో పాండిత్యం ఒలికించే వైదుష్యం పెదపాటి సొంతమని.. రచనా వ్యాసంగంలో ఆయన ఎంచుకున్న శిల్పాన్ని అద్భుతంగా విడమరచి చెప్పారు సుబ్బాచారి. తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణను ఈ దేశం పట్టనంత పండితుడిగా చెబుతారని, అయితే ఆ పేరు విశ్వనాథ సత్యనారాయణ కంటే ఆచార్య పెదపాటికి ఇంకా బాగా సరిపోతుందని ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. దేశం గర్వించే స్థాయిలో సాహితీ సేద్యం చేసిన పెదపాటికి తగిన గుర్తింపు రాకపోవడం బాధాకరమన్నారు. అందుకు పెదపాటి విశ్వబ్రాహ్మణుడిగా పుట్టడమేనని వాపోయారు. జీవితంలోని ఆఖరు మజిలీలో జ్ఞానపీఠ అవార్డు అందుకున్న రావూరి భరద్వాజను సుబ్బాచారి గుర్తు చేశారు. విశ్వబ్రాహ్మణుల్లో ఇంతటి ఔన్నత్యం ఉన్న సాహితీవేత్తలు ఉన్నా.. తగినంత గుర్తింపుగానీ, తగినన్ని అవకాశాలు గానీ రాకపోవడానికి విశ్వబ్రాహ్మణుల్లో ఐక్యత లేకపోవడమేనని, అందువల్లే పాలకులు వీరి విజ్ఞానాన్ని కూడా తేలిగ్గా తీసుకుంటున్నారన్నారు. ఇకనైనా విశ్వబ్రాహ్మణులు తమ శక్తి ఏపాటిదో తెలుసుకొని రాజకీయంగా ప్రభావశీలంగా ఎదగాలన్నారు. 


ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం నాయకుడు వేములవాడ మదన్ మోహన్.. పెదపాటి వాఙ్మయ సేవను ఎంతో కొనియాడారు. పెదపాటి నాగేశ్వరరావు, గంగాదేవి దంపతులను ఇలా వివాహ వేడుకగా చూడడం ఆనందంగా ఉందన్నారు. ఆయనలోని సాహితీ వైదుష్యాన్ని విశ్వబ్రాహ్మణజాతికి ఉపయోగపడేలా సంఘం తరఫున కృషి చేస్తానన్నారు. పెదపాటి శిష్యులు, అభిమానులు నిర్వహిస్తున్న మానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. విశేష సంఖ్యలో పెదపాటి అభిమానులు, సాహితీ శ్రేయోభిలాషులు హాజరయ్యారు. 

Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.