Skip to main content

మన గురువునే మరచిపోతే ఎలా?

ప్రపంచానికి అఖండమైన, అనిర్వచనీయమైన విజ్ఞానాన్ని అందించిన గురు పరంపర కలిగిన దేశం భారతదేశం. ఈ దేశానికి ఈ గుర్తింపు రావడానికి కారణం గురువులు మాత్రమే. యుగయుగాలుగా ఎందరో యోగి పుంగవులు, ఎందరో గురువులు ఈ దేశానికే కాదు.. ఈ ప్రపంచానికే దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అందుకే ఈ దేశాన్ని యోగులు సాగిన మార్గంగా చెబుతారు. మరి అలాంటి యోగుల్ని, అతుల్య గురువుల్ని స్మరించుకోవడం కనీస ధర్మం కాదా?

భారతదేశంలో విస్తరించింది ఏమంటే.. యోగమే. ప్రపంచమంతటికీ విస్తరిస్తున్నది కూడా యోగమే. అందుకే దీన్ని యోగులు నడిచిన నేలగా, యోగులు నడిపిస్తున్న దేశంగా పేర్కొంటూ ఉంటారు. ఈ దేశానికి వన్నె తెచ్చింది యోగులే. ఈ దేశానికి ఆభరణాలుగా మారిందీ.. యుగాలపాటు సాధన చేసిన గురువులే. ఈ దేశాన్ని నిలబెట్టంది ఎవరో ఒక గురువని ఎవరు చెబుతారు? ఎందరో గురువులున్నారు. ఒక్కో రుషి, ఒక్కో యోగి వేర్వేరు విషయాల్లో నిష్ణాతులయ్యారు. ప్రపంచానికి వేర్వేరు అంశాల్లో జ్ఞానామృతాన్ని అందించారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్ రెండో రాజధాని?

మనిషి అంటే వేరే కాదు.. వీడు కూడా ఒక జంతువే.. కాకపోతే మాటలు నేర్చిన జంతువు అంటూ శాస్త్రీయంగా నిర్వచించిన పాశ్చాత్య పండితులకు.. ఎప్పటికీ అర్థం కాని అనిర్వచనీయమైన మానవీయ జాగృతిని పరిచయం చేశారు భారతీయ యోగులు. శూన్యం నుంచి పూర్ణం దాకా ఈ ప్రపంచానికి విడమరచి చెప్పింది మన గురు పరంపర. అలాంటి ఎందరో గురువులను ఎలా గుర్తుంచుకోవడం? ఎంతమందిని స్మరించుకోవడం? అడుగడుగునా ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ కనిపిస్తే ఎవర్ని తొలి గురువుగా చెప్పుకోవాలి? ఈ ప్రశ్న బహుశా అందరినీ వేధిస్తూ ఉండవచ్చు. అందరినీ గుర్తుంచుకోవడం ఎలాగూ సాధ్యం కాదు. ఎవ్వరికీ వీలు కూడా కాకపోవచ్చు. అందుకే గురువులందరికీ మూలమైన ఆదిగురువును స్మరించుకోవడం ఒక్కటే పరిష్కారంగా అనుభవజ్ఞులు చెబుతారు. ఆ ఆదిగురువే పరమేశ్వరుడు. ఆయన్ని అనుసరించడమే, ఆయన్ని స్మరించుకోవడమే గురువులందరికీ ఇచ్చుకునే సత్కారమంటారు ఆచార్య జగ్గీ వాసుదేవ్.  

భారతీయులకు అన్ని పండుగలు వేరు... గురుపూర్ణిమ వేరు. గురువు అనే జ్ఞానదీపం పూర్ణచంద్రుడై ప్రకాశించిన రోజుగా పూర్ణిమను అభివర్ణిస్తూ ఉంటారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురుపూజోత్సవం చేస్తారు. గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించుకుంటారు. వారిని సత్కరించి తమ గురుభక్తిని చాటుకుంటారు. వారి ఆశీర్వాదాలు తీసుకొంటారు. జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా అలా చేస్తారు. అయితే గురువుకు అసలైన కానుక ఏంటంటే.. స్వీయ సమర్పణే. అందుకు సంకేతాత్మకంగా ఆదిగురువును స్మరించుకోవాలంటారు. ఆది గురువు స్మరణలోనే గురుపూర్ణిమను పరిపూర్ణం చేసుకోవాలంటారు. గురుపూర్ణిమ రోజున గురువును ఎవరు ధ్యానిస్తారో, ఎవరు స్మరిస్తారో వారికి జ్ఞాన చక్షువులు విచ్చుకుంటాయట. అజ్ఞానం అనే తమస్సు నుంచి మనిషిని వెలుగు వైపు నడిపించేది గురువే. ఒకసారి మనిషి మనోఫలకం ముందు జ్ఞానమనే టార్చిలైటు పరుచుకుంటే ఇంక చీకటి ఎక్కడిది? అన్నీ స్పష్టంగానే కనిపిస్తాయి. అస్పష్టత అనేది అణుమాత్రం కూడా ఉండదు. కళ్ల ముందు వెలుగు పరుచుకుంటే ప్రయాణం సులభమే కదా. అలాంటి జీవితకాలం సుదీర్ఘ ప్రయాణానికి శిష్యుణ్ని సమాయత్తం చేసిన గురువు కన్నా విలువైంది ఈ ప్రపంచంలో వేరే ఏముంటుంది? అందుకే ఈ ఒక్కరోజు గురువు కోసం కేటాయించాలట. 

వ్యక్తులకు వేర్వేరు గురువులు ఉండొచ్చు. కానీ ఆ గురువులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించింది ఆదిగురువు, ఆదియోగి, ఆదిభిక్షువు అయిన ఆ పరమేశ్వరుడే అంటారు ఆచార్య జగ్గీ వాసుదేవ్. ఆ ఆదిగురువు తన శిష్యగణాన్ని ఎలా తయారు చేసుకున్నాడు? ఈ ప్రపంచానికి జ్ఞానజ్యోతులు ఎలా అందించాడు.. అనేది చాలా ఆసక్తికరమైన అంశం. భారతదేశంలోని యోగ సంప్రదాయంలో శివుణ్ని దేవుడిగా చూడరు. ఆయన్ని 'ఆది యోగి' అనే పేర్కొంటారు. కొన్ని వేల ఏళ్ల క్రితం.. ఆధునిక ఆలోచనలు, భాషా పాటవాలు.. ఇలాంటివేవీ లేని కాలంలో హిమాలయ శిఖరాల్లో ఒక యోగి ప్రత్యక్షమయ్యాడట. ఆయన ఎక్కణ్నించి వచ్చాడో, పుట్టుపూర్వోత్తరాలేంటో ఎవరికీ తెలియదు. పేరు కూడా తెలియదు. అందుకే ఆయన్ని ఆది యోగిగా సంబోధిస్తారు. అక్కడంతా మనుషులున్నారు. ఆ యోగిని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆది యోగి వాళ్లెవరినీ పట్టించుకోలేదు. ఆయన ఎలాంటి చేష్టలూ చేయడం లేదట. ఆ యోగి సజీవంగా ఉన్నాడనటానికి ఆయన కళ్ల నుంచి స్రవించే పరమానంద బాష్పాలు తప్ప వేరే ఏ సూచనా లేదట. ఆయన శ్వాస కూడా తీసుకుంటున్నట్టు కనిపించలేదట. అయితే ఊహకైనా అందని అనుభూతిని ఆ యోగి అనుభవిస్తున్నాడని మాత్రం అక్కడి ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆ యోగి ఏదో చెబుతాడని వాళ్లంతా ఆశపడ్డారట. చాలాసేపు వేచి చూసినా.. ఆయన్నుంచి ఎలాంటి రియాక్షన్ కనిపించలేదు. వాళ్లంతా వెళ్లిపోయారట. అయితే ఏడుగురు అనామకులైన వ్యక్తులు మాత్రం అక్కడే ఉండిపోయారట. ఎలాగైనా ఆయన్నుంచి ఏదో అంశం నేర్చుకోవాలన్నదే వాళ్ల కృత నిశ్చయమట. అయినా ఆదియోగి వాళ్లను పట్టించుకోలేదు. వాళ్లు బతిమలాడారట. మీకు ఏది తెలిస్తే అదే మాకూ నేర్పండి అని వేడుకున్నారట.

అప్పుడాయన అంతర్వాణి నుంచి ఓ బలమైన హెచ్చరిక వినిపించిందట. మీరు మూర్ఖులు... ఇప్పుడు మీరున్న స్థితిని బట్టి చూస్తే.. కోటి సంవత్సరాలైనా సరే.. అది మీకు అర్థం కాదు.. దాన్ని తెలుసుకోవాలంటే మీరూ కృషి చేయాలి.. ఇందుకు ఎంతో సాధన అవసరం... ఇది వినోదం కోసం చేసేది కాదు... అని ఓ దైవీ స్వరం వినిపించిందట. అయితే వాళ్ల పట్టుదలకు, విజ్ఞప్తికి ఆ పరమేశ్వరుడు కరిగిపోయి కొన్ని సాధనాలు ఇచ్చాడట. దాంతో ఆ ఏడుగురు సాధన మొదలు పెట్టారు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాల తరబడి సాధన చేశారు. అలా వాళ్లు 84 సంవత్సరాలపాటు సాధన చేస్తూ వెళ్లారట. ఒక  రోజున సూర్యుడు సంచార దిశ మార్చుకుని ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రయాణం మొదలుపెట్టాడట. అది దక్షిణాయన ప్రారంభం అయింది. ఆ యోగి ఏడుగురి వంకా చూశాడు. వాళ్లిప్పుడు తేజోవంతులై వెలిగిపోతున్నారు. పరిపూర్ణ పరిణతితో, పరిపూర్ణ విజ్ఞానంతో ప్రపంచానికి ఇవ్వడానికి సన్నద్ధులై ఉన్నారు. వాళ్లే సప్తర్షులు. వారిని విస్మరించి వదిలేయటం ఆయన వల్ల కాలేదు. మళ్లీ పూర్ణిమ నాటికి తానే వాళ్లకు గురువు కావాలని నిశ్చయించుకున్నాడట. ఆ పూర్ణిమనే గురుపూర్ణిమగా అనాదిగా వస్తోంది. ఆది యోగి ఆది గురువుగా పరివర్తన చెందిన రోజే గురుపూర్ణిమగా వస్తోంది. ఆయన దక్షిణంగా ప్రయాణం కట్టి.. దక్షిణ ముఖుడైనందువల్ల ఆయన్ని దక్షిణామూర్తిగా కూడా పేర్కొంటారు. తనలో నిక్షిప్తమైన యోగ శాస్త్రాన్ని ఆ ఏడుగురు శిష్యులకూ ప్రసరింపజేశాడట పరమేశ్వరుడు. దక్షిణాయనంలో వచ్చే మొదటి పున్నమినే గురు పూర్ణిమ అంటారు. ఆరంభమే లేని ఆదియోగి.. ఆదిగురువై అవతరించిన రోజు ఈ రోజే. అదే గురుపూర్ణిమ. 

గురువు లక్షణం ఒకటే ఉంటుంది. అది శిష్యుణ్ని ఉద్ధరించడం. గరువుకు లక్ష్యం ఒకటే ఉంటుంది. అది శిష్యుణ్ని తనను మించినవాణ్ని చేయడం. సనాతన భారత సంప్రదాయ పరంపరలో ఇందుకు అనేక రుజువులున్నాయి. గురువు అడిగితే చిటికెన వేలు కోసి ఇచ్చిన విలుకాళ్లే కాదు.. శిష్యుడికి ఇచ్చిన మాట కోసం తాను చెడ్డవాణ్ని అవుతానని తెలిసినా.. శిష్యుడి మీద ఉన్న వాత్సల్యం చేత అర్జునుడిలాంటి వాణ్ని విశ్వ విలుకాడిగా తీర్చిదిద్దిన ద్రోణాచార్యులు కూడా కనిపిస్తారు. గురువును తల్చుకోగానే.. శిష్యుడి కష్టాలను దూదిపింజల్లా దూరం చేసిన వీరబ్రహ్మేంద్రస్వామి లాంటివారి గురించి ఎంత చెప్పుకన్నా తక్కువే. ద్వాపర యుగానికి చెందిన ద్రోణాచార్యుడి నుంచి.. నిన్నమొన్నటి వీరబ్రహ్మేంద్రస్వామి వరకు వేల ఏళ్లు గడిచిపోయాయి. కానీ గురు పరంపర మాత్రం చెక్కు చెదరకుండా సాగింది. వారిలో ఎవర్ని తీసుకున్నా.. తమ శిష్యులను తమకు మించి తీర్చిదిద్దేందుకు అహర్నిశలూ తపించినవారే.

మన దేశంలో అంతటి ఉన్నతమైన సంప్రదాయాలు నెలకొలనడానికి కారణం.. ఆనాడు సప్తర్షులకు యోగం నేర్పాలన్న తలంపును ఎంచుకున్న ఆదిగురువు పరమేశ్వరుడే. పరమేశ్వరుడు ఇచ్చిన సాధనల వల్ల ఆ ఏడుగురు తమ జీవన పర్యంతం సాధన చేస్తూ ప్రపంచానికి జ్ఞాన జ్యోతులై వెలిగారు. అయితే సప్తర్షుల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కో బ్రాహ్మణంలో ఒక్కో రకంగా వారి పేర్లను పేర్కొన్నారు. అయితే ఆ సప్తర్షుల పేర్లు వేర్వేరుగా ఉన్నా.. తొలిగా జ్ఞానబోధ అందుకున్నది మాత్రం సప్తర్షులేనని చాలా గ్రంథాల్లో ఉంది. తొలి గ్రంథమైన జైమినీయ బ్రాహ్మణం ప్రకారం ఆ సప్తఋషులు.. అగస్త్యుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, వశిష్టుడు, విశ్వామిత్రుడు. 

భారతీయ సంప్రదాతయంలో గురువుకు ఎన్ని రూపాలు ఉంటాయో చెప్పడం కష్టమే. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు క్షాత్ర ధర్మాన్ని త్యజించకుండా గురువును మించిన గురువయ్యాడు. పాండవులందరికీ దేవుడు ప్రసాదించిన గురువుగా అనుక్షణం వారిని అంటి పెట్టుకున్నాడు. అర్జునుడి మనో వైకల్యాన్ని దూరం చేసి, మళ్లీ విల్లమ్ములు అందుకునేలా చేసినా.. ధర్మరాజు ధర్మ నిరపేక్షతను కొనసాగించేలా చేసినా, ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న ద్రౌపదిని న్యాయ పోరాటం వైపు నడిపించినా.. శ్రీకృష్ణుడు ఎక్కడా ధర్మాన్ని అతిక్రమించకుండా చేశాడు. ధర్మాన్ని వంచించి అధర్మం చేసిన కౌరవులను.. ధర్మ మార్గపు జాడల్లోనే కడతేరిపోయేలా చేసి విశ్వశాంతి నెలకొల్పిన విశ్వగరువు అతను. గీతాసారాన్ని బోధించి మానవాళి నిరంతరం ధర్మ మార్గాన్ని అనుసరించేలా చేసిన నిరంతర గురువు ఆ కృష్ణమూర్తి. 

కలియుగంలో ఆదిశంకరాచార్యుణ్ని అద్వైత ఆచార్యుడిగా, అందరినీ మించిన అద్వైత గురువుగా భావిస్తారు. జ్ఞాన సాగరంలో పయనించే శిష్యులకు గురువు నావలాంటివాడని ఆయన గురువును అభివర్ణించారు. శిష్యులకు శ్రుతులు, స్మృతులు నేర్పడమే కాకుండా రాగద్వేషాలు అదుపు చేసుకోగల ఇంద్రియ నిగ్రహాన్ని అలవరచాలని, అరిషడ్వర్గాలకు దూరంగా సన్మార్గంలో నడిపించడం గురువు బాధ్యతే అని నిష్కర్షగా చెప్పారు. మరోవైపు వేద వేదాంతాల్లో నిపుణుడు, జ్ఞానసంపన్నుడు, ఈర్ష్యాద్వేషాలు లేనివాడు, యోగ సాధనాపరుడు, నిరాడంబరుడు అయిన వ్యక్తి మాత్రమే గురువు కాగలడని.. అలాంటి గురువులే శిష్యులలో అజ్ఞానాంధకారాన్ని తొలగించగలరని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆ లక్షణాలన్నీ నిలువునా నింపుకున్న అద్భుతమైన గురువే ఆదిశంకరాచార్యుడు. ఇండియాలో పుట్టిన బౌద్ధ మతం గానీ, జైన మతాలు గానీ.. శిష్యుడికి మోక్షాన్ని ప్రసాదించేవాడే గురువని చెబుతున్నాయి. వీరు మాత్రమే కాదు.. ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని కూడా ప్రతిపాదించి వివిధ పంథాలను రూపొందించిన గురువులకూ భారత్ లో కొరత లేదు. 

భారత్ లో అచలాన్ని బోధించిన తిరుగులేని సిద్ధాంతాలతో పాటే శిష్యుల నమ్మకాన్ని చూరగొన్న షిర్డీ సాయిబాబాను సైతం గురువులుగా భావించే ఉన్నతమైన సంస్కారాలు ఉన్నాయి. మనసులో ఒకసారి భక్తి భావం గూడు కట్టుకుంటే.. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరేం చెప్పినా సాయిని గురువుగా పరిగణించే ఔన్నత్యం కూడా భారతీయుల్లో ఉంది. షిర్డీ సాయిని గురువుగా భావించే సంప్రదాయం ఏర్పడడం ఆశ్చర్యకరంగా మొదలైందంటారు. సృష్టిలో ఎవరికైనా మొదటి గురువు తల్లిదండ్రులే. ఆ తరువాతే మోక్ష కారణమయ్యే గురువుకు స్థానం ఇచ్చారు. అయితే మహాభారత కాలం తరువాత వేదవ్యాస మహర్షిని మానవులందరికీ గురువుగా పరిగణించే సంప్రదాయం మొదలైంది. ఆయన పేరిటనే గురుపూర్ణిమను వ్యాస పూర్ణిమ పేరుతో జరుపుకుంటున్నాం. వ్యాసుణ్ని గురువుగా భావించి పూజించే సంస్కృతి కొనసాగుతున్న క్రమంలోనే 1910 ప్రాంతంలో సాయిని గురువుగా భావించే కొత్త సంస్కృతి మొదలైంది. షిర్డీలో సాయిబాబా భౌతికంగా ఉన్న రోజుల్లో పండరీపురం నుంచి వచ్చిన ఓ భక్తుడి చొరవ కారణంగా మిగతా భక్తులంతా సాయిని పూజించేందుకు పూనుకున్నారట. అయితే సాయి మాత్రం అక్కడున్న స్తంభాన్ని పూజించండి అని చెబితే.. అందుకు వారు ఒప్పుకోకుండా స్తంభాన్నెందుకు పూజిస్తాము.. మిమ్మల్నే పూజిస్తాము అన్నారట. అందుకు సాయి ముందు ఒప్పుకోకపోయినా.. ఆ తరువాత అంగీకరించారట. అయితే ఈ ఘటన 1908లో గురుపూర్ణిమ రోజునే జరిగిందట. సాయికి బట్టలు, ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చి పూజించారట. అక్కణ్నుంచి షిర్డీ సాయిని కూడా గురువుగా భావించి పూజించే ఓ కొత్త సంస్కృతి బయల్దేరిందంటారు.. అక్కడి విషయాలు తెలిసినవారు. 

ఆధునిక యుగంలో కూడా పలువురు గురువులు యోగా, ఆధ్యాత్మిక మార్గాల్లో తమ శిష్యులకు వెలుగుబాట చూపారు. బెంగాల్‌లో కాళికాదేవి భక్తుడైన రామకృష్ణ పరమహంస భగవంతుడు ఒక్కడేనని, అయితే ఆయనను చేరుకునే మార్గాలు అనేకం ఉన్నాయని బోధించాడు. రామకృష్ణుడి వద్ద ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వివేకానందుడు పాశ్చాత్య ప్రపంచంలో భారతీయ తత్వజ్ఞానానికి ప్రాచుర్యం కల్పించాడు. వివేకానందుడి ఆధ్వర్యంలో రామకృష్ణ భక్తి ఉద్యమం దేశ విదేశాలకు విస్తరించింది. భారతీయుల్లో దేశం పట్ల, ధర్మం పట్ల నూతనమైన ఆలోచన పంథాను లేవనెత్తింది వివేకానందుడే. ఆయన్ని ఆధునిక సన్యాసిగా, ఆధునిక గురువుగా పేర్కొంటారు. స్వతంత్ర పోరాటంలో భారతీయ తత్వ చింతనను చేర్చి.. ఆ పోరాటానికి జాతీయతా స్ఫూర్తిని అద్దింది వివేకానందుడే. ఇక గౌడీయ వైష్ణవ కుటుంబానికి చెందిన స్వామీ ప్రభుపాదుడు ‘ఇంటర్నేషనల్‌ సొసైటీ ఫర్‌ కృష్ణా కాన్షియస్‌నెస్’-ఇస్కాన్ ఉద్యమాన్ని దేశ విదేశాలకు విస్తరించారు. ఇండియాలో పుట్టిన కృష్ణుడి తత్వాన్ని, గీతాచార్యుడి బోధనలను ఇంగ్లిష్‌లోకి అనువదించి.. భారతీయ విజ్ఞానాన్ని దేశదేశాల్లో నెలకొల్పేందుకు పునాదులు వేశారు. అరుణాచలస్వామిగా పేరుపొందిన రమణ మహర్షి భక్తిమార్గాన్ని బోధించారు. అనేక మహిమలు చూపారు. పూర్తి నిరాడంబర జీవితాన్ని గడిపి.. ఆనందమయ జీవితానికి అదే తొలిమెట్టు అని నిరూపించారు. ఇలాంటి ఎందరో గురువులు భారతీయ వైదిక తత్వానికి, భక్తి మార్గానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు. అలాంటి గురువులందరినీ స్మరించుకునే రోజే గురుపూర్ణిమ. వారందరికీ రుణపడి ఉన్నామని చెప్పుకోవడమే అసలైన గురుదక్షిణగా ఆచార్య జగ్గీవాసుదేవ్ లాంటి పెద్దలు అనుభవ పూర్వకంగా చెబుతారు. 

ఇంతటి వైశిష్ట్యం గల గురుపూజా మూలాన్ని భారతీయులు విస్మరించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. భారత్ ను తెలివిగా, వంచనతో లొంగదీసుకునేందుకు యత్నించిన అనేక శక్తులే.. విద్య ద్వారా పరిపాలనలోకి ప్రవేశించి గురుపూజా స్ఫూర్తిని మంట గలిపాయన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే గురుపూజా ఉత్సవాన్ని ఓ శుభ దినంగా, పర్వదినంగా జరుపుకోక పోవడమే అందుకు కారణంగా చెబుతున్నారు. గురుపూర్ణిమ అనేది అలౌకికానంద స్థితికి, అన్నింటికీ అతీతమైన అత్యున్నత స్థితికీ, ఆఖరు గమ్యమైన మోక్షానికీ సంబంధించిందట. నేటి తరానికి ఆ స్థితి సాధ్యం అన్న విషయమే తెలియకుండా పోయింది. జన్యు వారసత్వం ఎలాంటిదైనా, తల్లిదండ్రులు ఎవరయినా, జన్మతః ఏ జాతికి చెందినవారైనా.. కృషి చేయడానికి సంసిద్ధంగా ఉంటే.. అలాంటివారందరూ అతీత స్థితిని పొందవచ్చు అని చెప్పే అపురూపమైన పున్నమి వెన్నెల రోజే గురుపూర్ణిమా దినం. 

భారతీయ ప్రాచీన సంప్రదాయం ప్రకారం ప్రతి నెలలో వచ్చే పూర్ణిమ, అమావాస్యలు ఎంతో శక్తిమంతమైన, అద్భుతమైన రోజులు. యోగ సాధన చేయడానికి, అతీత స్థితిని అందుకోవడానికి ఆ రెండు రోజులు ఎంతో విలువైనవిగా పరిగణించేవారు. అందుకే పూర్వకాలంలో ఆ రెండు రోజుల్లో ఎవరూ పనిచేసే వారు కారు. రోజువారీ పనులన్నీ బంద్ చేసి సాధనలో మునిగేవారట. అయితే దేశంలో బ్రిటిష్ విద్యావిధానానికి ప్రాముఖ్యత ఏర్పడినాక, భారతీయ విద్య పనికిరానిది అన్న అభిప్రాయాన్ని రంగరించి నూరిపోసి.. ఆ రెండు రోజుల సెలవు దినాలను రద్దు చేసి ఆదివారాన్ని సెలవు దినంగా పరిచయం చేశారు. దీంతో మన కల్చర్ మారిపోయింది. అలవాట్లు మారిపోయాయి. సాధన మూలన పడింది. గమ్యం, గమనం అన్నీ దారి తప్పాయి. ఫలితంగా క్రమంగా గురుపూజోత్సవం ఒక సంప్రదాయ తంతుగానే మిగిలిపోయిందంటారు జగ్గీ వాసుదేవ్ లాంటి ఆధునిక యోగులు. 

అందుకే నేటి ప్రభుత్వాలు.. గురుపూర్ణిమ విలువను, ప్రశస్తిని అర్థం చేసుకొని ఆ రోజును సెలవు దినాలుగా పరిగణించాలని ఆయన కోరుతున్నారు. యోగ సాధనలో ఉన్నవారు విధులకు వెళ్లకుండా సెలవు తీసుకోవాలని సూచిస్తున్నారు. కేవలం సెలవు తీసుకోవడం కాకుండా.. గురు ప్రీతి కోసం గురువు చూపిన యోగమార్గంలో పయనించాలని.. రోజంతా గురు ధ్యానంలోనే గడపాలని, సాధన చేయాలని నవతరానికి ఆయన సూచిస్తున్నారు. పాలకులు కపట నాటకాలు కట్టిపెట్టి ప్రజల్లో ఆధ్యాత్మిక భావాలు పెంచాలని.. తాము కూడా ఆధ్యాత్మిక తీరాల వైపు అడుగులు వేయాలని.. అప్పుడే పాలకులు చేసే పనుల్లో ప్రజాభీష్టం తొంగి చూస్తుందని.. అప్పుడు ప్రజలు కూడా పాలకులకు మనస్పూర్తిగా సహకరిస్తారని జగ్గీ వాసుదేవ్ సూచిస్తున్నారు. సామాన్య మనుషుల్ని గురువులకు చేరువ చేసే ఇంతటి విలువైన సూచనను పాటించే ప్రభుత్వాలు వస్తాయా? రావాలని కోరుకుందాం.

Comments

Popular posts from this blog

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?