అప్పుడెప్పుడో తెలంగాణ ఏర్పాటుకు ముందు సెకండ్ క్యాపిటల్ అన్న మాట బాగా వినిపించింది. అప్పుడు ఉద్యమ సమయం కాబట్టి.. ఒక వర్గంవారు సమర్థిస్తే.. తెలంగాణ ఉద్యమకారుల నుంచి తీవ్రమైన విమర్శలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి కూడా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అవుతుందన్న ధీమా బలంగా వినిపిస్తోంది. అందుకు కారణాలేమై ఉంటాయి?
దేశ రాజధానిగా ఢిల్లీ సేఫే కదా? అన్ని రకాల అంతర్జాతీయ హంగులూ అక్కడ ఉన్నాయి కదా? అయినా హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలన్న ఆలోచన మళ్లీ ఎందుకు ఊపిరి పోసుకుంటోంది? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలో అత్యంత సీనియర్ నేతగా ఉండడమే గాక.. మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేసిన చెన్నమనేని విద్యాసాగర్ రావు నోటి నుంచి హైదరాబాద్ రెండో క్యాపిటల్ అన్న మాట వినిపించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ కావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని.. 1956లో అంబేద్కర్ కూడా అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చారని.. అది ఈనాడు సాకారమయ్యే అవకాశాలు ఉన్నాయని సాగర్జీ చెప్పుకొచ్చారు.
Also Read: తెలంగాణ జాతిపిత యాదిలో..
Also Read: ఆద్యంతం "వికార పురుష్"
ఇది కూడా చదవండి: మన గురువునే మరచిపోతే ఎలా?
హైదరాబాద్ గురించి ఇప్పుడు సాగర్జీ మాట్లాడడమే కాదు.. ఇటీవల హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం తెలంగాణ సర్కారు.. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ను ఆహ్వానించింది. ఆ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్.. సెకండ్ క్యాపిటల్ అంశాన్ని ప్రస్తావించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాల్సిన అవసరాన్ని ఆనాడు అంబేద్కర్ నొక్కి చెప్పారని.. అది జరగాల్సిన అవసరం ఉందని.. ఇప్పుడా పరిస్థితులు వచ్చినట్లు తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. మరోవైపు తాను మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు ప్రకాశ్ అంబేద్కర్ తనను తరచూ కలిసేవారని.. తమ చర్చల్లో సెకండ్ క్యాపిటల్ అంశం ప్రముఖంగా వచ్చేదని విద్యాసాగర్ రావు చెప్పడం విశేషం. అంటే బయటకు పొక్కలేదు కానీ.. రెండో రాజధానిపై టాప్ లెవెల్లో పార్టీలకు అతీతంగా చర్చలు బాగానే జరుగుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతోందంటున్నారు పరిశీలకులు.
విద్యాసాగర్ రావు తన మనోగతాన్ని చెప్పగానే.. కాంగ్రెస్ మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన పొన్నం ప్రభాకర్ స్పందించడం ఆసక్తి రేకెత్తించింది. హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే తెలంగాణ బిడ్డగా తాను స్వాగతిస్తున్నానంటూ ఆయన ప్రకటించారు. పొన్నం తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పినా.. కాంగ్రెస్ లో మల్లు రవి లాంటి సీనియర్ మాత్రం ఆ అంశం మీద లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం అది అంత ఆశామాషీ వ్యవహారం కాదని.. ఆ పరిస్థితి వస్తే హైదరాబాద్ లో అధికారాలపై, ఆదాయాల పంపిణీపై సుదీర్ఘంగా చర్చించాల్సి ఉంటుందనడం విశేషం. అటు బీఆర్ఎస్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్.. రాష్ట్రాల హక్కుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడమే తప్ప.. ఢిల్లీ పెద్దలు తెలంగాణకు ఏమీ చేయలేదని.. ఆ విషయాలు కప్పి పుచ్చుకోవడానికే ఈ అంశం తెరపైకి తెస్తున్నారని అభిప్రాయపడ్డారు. అయితే విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు ప్రకాశ్ అంబేద్కర్ తన అభిప్రాయం చెప్పి వెళ్లిపోయాక.. ఆ విషయాన్ని బీఆర్ఎస్ నేతలెవరూ ఖండించకపోవడం విశేషమే.
దేశానికి రెండో రాజధాని ఇప్పుడు ఎంతవరకు అవసరం అన్నది ప్రధానమైన చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే రెండో రాజధాని మాట చెప్పారట. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో 1955లో ఈ విషయాన్ని ప్రస్తావించారట. అప్పుడు అంబేడ్కర్ వాదనతో ప్రజల్లో ఏకీభావం కూడా వచ్చిందట. అప్పుడు దేశ జనాభా 33 కోట్లే ఉన్నా.. అప్పుడే ఢిల్లీ మీద విపరీతమైన ఒత్తిడి పెరగడం ప్రారంభమైంది. రాజధానితో పాటు ఇతర ప్రభుత్వాస్తులకు రక్షణగా 1911లోనే కోల్ కతాకు రాజధానిని తరలించినా అది వ్యూహాత్మకంగా మంచిది కాదన్న అభిప్రాయం అప్పుడే ఏర్పడిందంటారు. సముద్ర తీరం ఒడ్డున దేశ రాజధాని ఉండడం శ్రేయస్కరం కాదన్న ఉద్దేశంతో మళ్లీ ఢిల్లీకే తరలించారు. అయితే మొగల్స్ కాలంలో తుగ్లక్ కూడా ఢిల్లీ నుంచి మధ్యభారతంలోని దేవగిరికి తరలించాడు. మంగోలుల దాడుల నుంచి రాజధానిని కాపాడుకోవడం ఒకటి.. అలాగే దేవగిరికి మార్చుకుంటే.. దక్షిణ భారతం మీద కూడా అదుపు సాధించడం సులువవుతున్న ఉద్దేశం మరోటి. అయితే ఉద్దేశం ఏదైనా.. రాజధానిని తరలించే క్రమంలో జరిగిన నష్టాన్ని భరించడం తుగ్లక్ కు కష్టంగా మారిందట. పైగా ప్లేగు కూడా తీవ్రంగా సోకడంతో అన్ని సౌకర్యాలూ ఉన్న ఢిల్లీనే శ్రేయస్కరమని.. మళ్లీ రాజధానిని ఢిల్లీకి మార్చేశాడట.
అయితే అప్పట్లో రాజధానిని మార్చారే గానీ.. ఒకటి ఉండగానే మరోటి నెలకొల్పుదామనే ఆలోచన అప్పటికి ఏర్పడలేదు. అందుక్కారణం అప్పుడున్న జనాభా కావచ్చు. అవసరాలు కావచ్చు. ఇప్పుడైతే అవసరాలు పెరిగిపోయాయి. జనాభా 4 రెట్లు పెరిగింది. ఢిల్లీ మీద ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దీంతో ఢిల్లీకి ఆ సామర్థ్యం లేదన్న అభిప్రాయాలు అన్ని వర్గాల్లోనూ ఏర్పడుతున్నాయి. ఆధునిక కాలంలో రాష్ట్రపతి కోసం ఉత్తరాన షిమ్లా, దక్షిణాన హైదరాబాద్ విడిది కేంద్రాలుగా ఆతిథ్యం ఇస్తున్నాయి. దక్షిణాన రెండో రాజధాని కాగలిగిన సామర్థ్యం హైదరాబాద్ కే ఉందన్న ఆమోదయోగ్యమైన అంగీకారం అందరిలోనూ స్థిరపడిపోయింది.
కేంద్రంలోని బీజేపీ గనక రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తామంటే.. స్వాగతించేవారు ఎక్కువగా ఉండే అవకాశాలే ఉన్నాయి. అయితే అందుకోసం హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాల్సి వస్తుంది. ఈ విషయంలోనే ఇక్కడి బీఆర్ఎస్ గానీ, కాంగ్రెస్ నేతలు గానీ అంగీకరించకపోవచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణ నుంచి అత్యధిక ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. కేంద్రపాలిత ప్రాంతం అయితే ఢిల్లీలో మాదిరిగా కీలకమైన నిర్ణయాధికారాలు, శాంతిభద్రతలపై పాలనాధికారాలు కేంద్రం చేతుల్లోకే వెళ్లిపోతాయి. అలా జరగకుండా ఏదైనా మధ్యేమార్గం ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతంగా మార్చకుండా.. కేంద్రం ఎలాంటి పెత్తనం చేయజాలదు. అలా కాకుండా హైదరాబాద్ ను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేకాధికారాలు కట్టబెట్టాలంటే అందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. అప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలు, ఓటింగ్ ల మీద ఆధారపడి విషయం సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుందంటున్నారు.
ఇక బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని భావించినా.. ఉద్యమ సమయంలో వినిపించినంత తీవ్రమైన స్వరంగానీ, కచ్చితమైన వైఖరి గానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ తీసుకునే అవకాశాల్లేవంటున్నారు. కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న అభిప్రాయాలు విభజనకు ముందు వినిపించినప్పుడు ఉద్యమకారులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ఆ స్థాయి నిరసన ఇప్పుడొచ్చే అవకాశం లేదంటున్నారు. అందుక్కారణం టీఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బీఆర్ఎస్ ను దేశమంతటికీ విస్తరించాలని భావిస్తున్న కేసీఆర్... హైదరాబాద్ ను తెలంగాణ ప్రజల అంశంగా మాట్లాడితే అది నప్పదు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దక్షిణాదిన హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై వంటి నగరాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వాతావరణ సమతౌల్యత విషయంలో అందరూ హైదరాబాద్ కే మొగ్గు చూపారు. అంబేద్కర్ మహారాష్ట్రకే చెందిన వ్యక్తి అయినా రెండో రాజధానిగా ఆయన పుణేను గానీ, ఇతర పట్టణాన్ని గానీ ప్రతిపాదించలేదు. హైదరాబాద్ ను మాత్రమే సజెస్ట్ చేయడం విశేషం. చుట్టూతా కొండ ప్రాంతాలు, అడవులతో పాటు మనుషులు, ఇతర జంతుజాలం ఆరోగ్యంగా ఉండగలిగిన సమశీతోష్ణ వాతావరణం హైదరాబాద్ సొంతం. సెక్యూరిటీ పరంగానూ ఏ నగరంతో పోల్చుకున్నా సేఫెస్ట్ ప్లేస్ గా ఉంది. అదే ఢిల్లీని చూసుకుంటే 300 నుంచి 400 కి.మీ దూరంలోనే పాకిస్తాన్ ఉంది. అటు చైనా బోర్డర్ కి కూడా ఢిల్లీ అందుబాటులోనే ఉందన్న చర్చలు ఇప్పటికే ఉన్నాయి. ఇదే అంశాన్ని అప్పట్లో అంబేద్కర్ ప్రస్తావించారు. అదే అంశాన్ని ఇప్పుడు విద్యాసాగర్ రావు, ప్రకాశ్ అంబేద్కర్ తెరముందుకు తెస్తుండడం విశేషం. మరోవైపు ఢిల్లీ మొత్తం కాలుష్యం కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. చలికాలంలో ఏర్పడే మంచుకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఒత్తిడి ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన దృష్ట్యా మరింత ఒత్తిడి పెంచడం ఏమాత్రం సరికాదన్న అభిప్రాయాలు నిపుణుల్లో వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో కొత్త రాష్ట్రాలు ఏర్పడడం, కొత్త జిల్లాలు పెరగడంతో ఢిల్లీ మీద ఇక ఏమాత్రం మోపలేనంత భారం పెరగడం ఖాయమంటున్నారు. దీంతో అదనంగా మరో రాజధాని ఏర్పాటు చేయక తప్పదన్న అభిప్రాయానికి ఇప్పటికే కమలనాథులు వచ్చి ఉన్నారన్న వ్యాఖ్యలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయి.
ఒకవేళ హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకుంటే అది రాజకీయంగానూ బీజేపీకి కలిసొచ్చే అంశం కావాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపు తీసుకుంటారా.. లేక ఎన్నికల తరువాత ఆ దిశగా అడుగులు వేస్తారా అంటే అది ఇప్పుడు చెప్పడం కష్టమేనంటున్నారు. కాకపోతే విద్యాసాగర్ రావు ద్వారా వ్యూహాత్మకంగా ఒక చర్చకు మాత్రం తెర తీశారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్న అంశాన్ని తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిన పేర్కొన్న విద్యాసాగర్ రావు.. అంబేద్కర్ చెప్పినట్టు సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించింది మాత్రమే గాక... టెర్రరిజాన్ని కూడా జోడించారు. ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవడానికి తెగించి ప్రయత్నిస్తున్న టెర్రరిస్టులు.. అనేక దేశాల్లో బలమైన శక్తులుగా తయారైపోతున్నారు. అమెరికా, కెనడా, ఇంగ్లాండ్ వంటి అనేక దేశాల్లో టెర్రరిస్టులు బలవంతులుగా మారిపోయారు. స్థానిక ప్రజలకన్నా టెర్రరిస్టులకు మద్దతిస్తున్న మైగ్రెంట్స్ హక్కులకే ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా యూరోప్ లో వలస వస్తున్న విదేశీయులకే ప్రాధాన్యం పెరిగిపోతోంది. పోలీసు బలగాల మీద సైతం టెర్రరిస్టు మద్దతుదారులు పెట్రేగిపోతున్నారు. ఈ పరిస్థితి కొన్నేళ్లుగా చాపకింద నీరులా సాగి ఇప్పుడు బాహాటంగానే వ్యక్తమవుతోంది. ఇస్లామిక్ టెర్రరిజానికి ఖలిస్తాన్ టెర్రరిస్టులు కూడా తోడవుతున్నారు. దీంతో స్థానిక ప్రజలకే ఇప్పుడు రక్షణ లేకుండా పోతోంది.
అలాంటి పరిస్థితుల్లో టెర్రరిజాన్ని అణచివేయాలంటే ఇండియాతో కలిసి అడుగులు వేయక తప్పదన్న ఆలోచనకు ప్రపంచ దేశాలు వచ్చాయని.. ఈ క్రమంలో మోడీ చేస్తున్న ప్రపంచ పర్యటనల్లో ఉగ్రవాదం అణచివేతనే టాప్ ప్రయారిటీగా ఉంటోందని.. ఆ విషయంలో మోడీ సహకారం తీసుకోవాలని అనేక దేశాధినేతలు అనుకుంటున్నారని విద్యాసాగర్ రావు చెప్పడం ఆసక్తిగా మారింది. ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికో సంబంధించింది కాదని.. దాని మీద అన్ని దేశాలూ సంయుక్తంగా తిరగబడితేనే అదుపు చేయడం సాధ్యమవుతుందని.. మోడీ గత చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. అన్ని దేశాలనూ అదే ప్రాతిపదికపై ఏకం చేసేందుకు మోడీ యత్నిస్తున్నారు. ప్రపంచంలో తొలిసారిగా ఈ చొరవ తీసుకున్న దేశంగా భారత్ నిలువడంతో మోడీపై క్రెడిబిలిటీ పెరిగిందంటున్నారు. అందుకే మోడీ ఆలోచనలకు సహకరించాలని పలు దేశాలు ఆలోచిస్తున్నాయని ఒక విస్తృతమైన అంశాన్ని విద్యాసాగర్ రావు అతితక్కువ మాటల్లో చెప్పుకొచ్చారు. ఈ అంశం ఇలా ఉంటే.. సేఫ్టీ పరంగా కూడా ఢిల్లీ అంత సేఫ్ జోన్ కాదన్న అభిప్రాయం క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో పెరుగుతున్న క్రైమ్ రేటే అందుకు సాక్ష్యం. అందులోనూ టెర్రరిస్టుల కార్యకలాపాలు తీవ్రమైపోయాయి. ఎర్ర కోట మీద ఖలిస్తాన్ జెండా కూడా ఎగరేయడం లైట్ తీసుకునే పరిణామం కాదంటున్నారు రక్షణ రంగ నిపుణులు. దానికితోడు ఇస్లామిక్ ఉగ్రవాదం ఢిల్లీని లొంగదీసుకునే ప్రయత్నం తీవ్రంగా చేస్తోంది. ఈ క్రమంలో అలాంటి ప్రమాదాలకు అవకాశం లేని ఓ సురక్షితమైన ప్రదేశం కావాలన్న ఉద్దేశంతోనే హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలన్న తలంపు పెరుగుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ సాధించుకున్న నేపథ్యంలో అదనపు రాజధానిని ఏర్పాటు చేసుకుంటే ఇక్కడి యూత్ కు అవకాశాలు పెరుగుతాయని విద్యాసాగర్ రావు చెబుతున్నారు. అయితే బీజేపీ విరోధులు గానీ, కేంద్ర ప్రభుత్వ విరోధులు గానీ.. అసలు రాజధానిని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలన్న అవసరమే లేదంటున్నారు. ఇండియా గతంలో మాదిరిగా బలహీనంగా లేదని.. ఏ దేశానికైనా దీటుగా సమాధానం ఇవ్వగల సత్తా ఇండియాకు ఉందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప అందులో మరే ఉద్దేశమూ లేదంటున్నారు. యూరోప్ లోని సుదూర లక్ష్యాలను సైతం ఛేదించగల ఖండాంతర క్షిపణుల్ని కలిగి ఉందని.. అలాంటప్పుడు ఏడెనిమిది వందల కిలోమీటర్ల దూరం అనేది పెద్ద విషయం కాబోదంటున్నారు. మళ్లీ అవే గొంతులు.. చైనాతో విభేదాలు తలెత్తినప్పుడు ఇండియా అత్యంత బలహీనమైందని.. చైనాను ఢీకొనే సత్తా లేదని దెప్పి పొడుస్తూ ఉంటాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీపరమైన వ్యతిరేకతతో వారు ప్రతిదాన్నీ శంకిస్తారే తప్ప.. దేశీయ అవసరాల మీద వారికి చిత్తశుద్ధి ఉండదన్న అభిప్రాయాలు ఉన్నాయి. రాజధానిని ఏర్పాటు చేస్తే అది బీజేపీకి లాభిస్తుంది కాబట్టే వ్యతిరేకిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే బీజేపీ నుంచి కిషన్ రెడ్డి లాంటి సీనియర్లు.. కేంద్రం దగ్గర అలాంటి ప్రపోజల్ లేదని చెప్పినా.. అది పెద్దగా అతికినట్టు కనిపించడం లేదన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసింది.. అన్ని స్థాయిల్లో కీలకంగా పనిచేసిన విద్యాసాగర్ రావు కాబట్టి.. బలమైన సమాచారం లేకుండా ఆయనెలా అంటారు అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇక దేశంలో ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్య గ్యాప్ పెరుగుతోంది. సుదూరంగా ఉన్న తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వెళ్లడం వ్యయ, ప్రయాసలే కాదు.. విలువైన సమయాన్ని కూడా వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు హిందీ రాష్ట్రాల ఆధిపత్యం అనే భావన బలపడుతోంది. దీనికి చెక్ పెట్టడం కోసమే.. కేంద్రం ఇటీవల సెంగోల్ ను పార్లమెంట్ లో పెట్టి తమిళనాడుకు ప్రాధాన్యతనిచ్చింది. తమిళనాడు నుంచి ప్రధాని కూడా కావాలని అమిత్ షా వ్యాఖ్యానించడం విశేషం. తమిళనాడు నుంచి గతంలో యాక్టివ్ గా ఉన్న వేర్పాటు శక్తులకు మద్దతుదారులు మళ్లీ బయటికొస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. వాటికి చెక్ పెట్టాలంటే దక్షిణాదిన ఓ మంచి నగరాన్ని ఎంచుకొని రెండో రాజధానిగా పెట్టడమే మేలన్న అభిప్రాయాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు బెంచ్.. ఒకటో, రెండో పార్లమెంట్ సెషన్లు ఇక్కడ పెట్టుకోవడం వల్ల.. ఆటోమేటిగ్గా ఈ ప్రాంతానికి ప్రాధాన్యత పెరుగుతుంది. విదేశీ రాయబార కార్యాలయాలు, వాటి అనుబంధ కార్యాలయాలు ఇక్కడ వెలుస్తాయి. ఇప్పటికే మెట్రో సిటీగా ఉన్న హైదరాబాద్ ఇకపై ఇంటర్నేషనల్ సిటీగా మారుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. భూములకు మరింత డిమాండ్ పెరుగుతుంది. పరిశ్రమలు మరిన్ని వస్తాయి. ఇలా లోకల్ కల్చర్ కాస్తా వాల్డ్ కల్చర్ గా ఎదుగుతుంది.
ఎటొచ్చీ ఇక్కడ పెరిగే ఆదాయమంతా కేంద్ర ఖజానాకే చేరితే అప్పుడు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా బలహీనపడుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండే మధ్యేమార్గం కోసం ఎలాంటి కసరత్తులు జరుగుతాయన్నదే ఇప్పుడు కీలకాంశంగా మారిందంటున్నారు పరిశీలకులు. ఇక దేశంలో రెండో రాజధాని గనక వస్తే.. ఏపీలో మూడు రాజధానుల అంశానికి నైతికంగా మద్దతిచ్చినట్టు అవుతుందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 3 రాజధానుల వైపు తీవ్రంగా మొగ్గు చూపుతున్న వైసీపీ అధినేత జగన్.. సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుంటూ తన నిర్ణయాన్ని మాత్రం కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం లేదు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గనక నిర్ణయం తీసుకుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయోనని బెంగటిల్లుతున్నట్లు వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం హైదరాబాద్ వైపు మొగ్గు చూపితే అది జగన్ నిర్ణయాన్ని ఖాయం చేస్తుందంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆంధ్రా ప్రాంత నాయకులు రెండో రాజధాని అంశాన్ని ఒక ఆప్షన్ గా ఇచ్చి ఉన్నారు. అదే నిర్ణయం ఇప్పుడు కేంద్రం తీసుకుంటే హైదరాబాద్ లో ఉండే సీమాంధ్ర ప్రజలు కచ్చితంగా బీజేపీకి ఫేవర్ అవుతారన్న అభిప్రాయాలున్నాయి. అది అంచనా వేయడం వల్లనే ప్రకాశ్ అంబేద్కర్ స్టేట్ మెంట్ ను ఖండించలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటు ఎంఐఎం ఎలా స్పందిస్తుందన్నది కూడా ఇంట్రస్టింగ్ గా మారింది. గతంలో రాయల-తెలంగాణ కోరిన అసదుద్దీన్... కేంద్రపాలిత ప్రాంతంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయితే బీఆర్ఎస్ కూడా ఆ విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో అన్నీ బేరీజు వేసుకొని బీజేపీ నేతలు ఎలా వ్యవహరిస్తారు? ఇతర పార్టీలు ఎలా స్పందిస్తాయి? ఆఖరుకు ఎలాంటి మధ్యేమార్గం అనుసరిస్తారు? రాజకీయ పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Comments
Post a Comment
Your Comments Please: