Skip to main content

న గల్లీ తుమ్హారా.. న ఢిల్లీ తుమ్హారా..

ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో  ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా. 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీయేను దెబ్బ కొట్టేందుకు అక్కడ ఓ వారం రోజులపాటు ఠికానా వేసి శాయశక్తులా ప్రయత్నించి విఫలమైంది. అటువంటి బలుపును తగ్గించేందుకే మోడీ-షా కనుసన్నల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముంబైలో కాలు మోపారు. పలువురు బాలీవుడ్ పెద్దలతో భేటీ అయి చర్చించారు. బాలీవుడ్ కి దీటుగా యూపీలో ఇండస్ట్రీ తయారయ్యేందుకు తాయిలాలు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ యహా సే బాలీవుడ్ కో కోయీ నహీ లే జా సక్తా... అని అక్కసు వెళ్లగక్కాల్సి వచ్చింది. 

ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నప్పుడు.. బండి సంజయ్ ని, తెలంగాణ పర్యటించబోతున్న ఉత్తరాది నాయకుల టూర్ ను దృష్టిలో పెట్టుకొని.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మా హైదరాబాద్ ల మీ లొల్లేందిర బై అని అనడాన్ని గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ లో పుట్టి పెరిగినంత మాత్రాన మేం ఏం చేసినా చల్తా హై అనే యాటిట్యూడ్ ను ఏ విధంగా సమర్థించుకుంటారు? హైదరాబాద్ మీదైతే మీరేం చేసినా ఓకేనా? మీకు అవగాహన ఉన్నవారితో చీకటి ఒప్పందాలు చేసుకొని రాజ్యమేలుతామంటే ప్రజలకు ఓకేనా? ఈ వైఖరే మంచిది కాదు. హైదరాబాద్ లో పాదుకొని ఉన్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సర్కారు చెప్పినట్టు వింటారు.. మాదకద్రవ్యాల ఆరోపణల కేసును కూడా నీరుగార్చినా ఎవరేం మాట్లాడొద్దు.. వారు ఇక్కడే ఉండటానికి ఏమైనా చేస్తాం.. మేం చెప్పినట్టే వారు వింటారు.. వినాల్సిందే... అనే వైఖరి ఇక్కడ తెలంగాణ సర్కారులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. 


రామోజీరావు ఫిల్మ్ సిటీ కి ప్రత్యామ్నాయంగా రాచకొండ గుట్టల మీద సువిశాలమైన భూమిలో ప్రపంచం నివ్వెరపోయే ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గర్వంగా ప్రకటించారు. అందరూ సంతోషించారు. చాలా మంది పేదలకు, తెలంగాణలో ఉన్న సినిమా ప్రియులకు మంచిరోజులు వచ్చాయని అంతా సంతోషించారు. కానీ అలాంటిదేదీ జరగలేదు. ఇక్కడివారు ఏపీకి వెళ్లలేదు. వెళ్లాలన్న ఆలోచన కూడా వారికి లేదు. ఇదే అదనుగా ఇక్కడే ఉన్న సినీ ప్రముఖులను ఎలా మేనేజ్ చేయాలో, వారితో ఎలా రాజకీయ ప్రయోజనాలు పొందాలో మాత్రం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా పని చేసుకుపోతున్నారు. 

Also Read: గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?

                    గీ పట్నపోల్లకు ఏమైంది?

అయితే ముంబైలో పాతుకుపోయిన బాలీవుడ్ కీ-పర్సన్స్ ఒకవేళ నిజంగా యూపీకి తరలిపోతే.. తెలంగాణలో పాతుకుపోయిన టాలీవుడ్ కీ-పర్సన్స్ కూడా ఎక్కడికీ పోరని, లేక ఇక్కడే ఉంటారన్న గ్యారెంటీ ఏంటి? ఉండాలన్న కన్సర్న్ ఏంటి? శివసేన-కాంగ్రెస్ అవగాహనతో ఏమైనా చేద్దాం అనుకొని పథకరచన చేసుకున్నాయి. ఇక్కడా అలాంటిదే జరిగింది... జరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ ఆ ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తోంది. ఇక్కడ కూడా అదే బీజేపీ ఈ ఇద్దరినీ డిస్టర్బ్ చేయడం చూస్తూనే ఉన్నాం. మరి.. సొంతమని తెగ ఇదైపోతూ ఫీలైపోతున్న సొంత ఇలాకాలోకి ఇతరులు రాకుండా అడ్డుకునేదెవరు? రమ్మని తలుపులు తెరవాల్సిందెవరు? ఎవరి పని వారు చేసుకుపోవడమే రాజకీయ క్రీడ. ఆట ఇప్పుడు అంతటా మొదలవుతోంది. బీ కేర్‍ఫుల్. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

అలుపెరుగని పోరాట యోధుడు పద్మాచారి

తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పద్మాచారి 62వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ లో ఉన్న ఆఫీసర్స్ మెస్ లో తెలంగాణ ఉద్యోగులు, ఉద్యోగుల సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆయన మరింత కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి పద్మాచారి చేసిన సేవలు మరువలేనివని. ఏ చిరు ఉద్యోగికి ఆపద వచ్చినా ఆపద్బాంధవుడిలా ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడే యోధుడు అని ఏసీపీ (సీసీఎస్) కె.ఎం కిరణ్ కుమార్ అన్నారు. రెండేళ్ల క్రితమే పద్మాచారి పదవీ విరమణ పొందారు. ఉద్యోగులందరూ మళ్లీ పద్మాచారిని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పద్మాచారి 61 సంవత్సరాలు పూర్తి చేసుకుని 62వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మాసబ్ ట్యాంక్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మెస్ లో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.  ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ కె.ఎం. కిరణ్ కుమార్ ఎ.సి.పి(సి.సి.ఎస్) మాట్లాడుతూ... పద్మాచారి లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గౌరవాధ్యక్షులుగా పని చేయటం, ఉద్యోగుల సమస్యలు ఎంత జటిలంగా ఉన్నప్పటిక...