జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్ రాకేశ్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, జోర్దార్ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. శుక్రవారం పాటను రిలీజ్ చేయగానే.. రాత్రి వరకు దాన్ని సోషల్ మీడియాలో పెట్టేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
ఆ పాట వింటున్నకొద్దీ తెలంగాణ స్ఫూర్తితో గోరటి సాహితీ వైదుష్యం ఓలలాడిస్తుండగానే.. ఎక్కడా ప్రొఫెసర్ జయశంకర్ జాడ కనిపించకపోవడం తెలంగాణవాదుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతోంది. అయితే దీనిపై తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం ఆయన్ని వివరణ కోరింది. అయితే ముందుగా అది సినిమా పాట అని.. ఆ సినిమాలో జయశంకర్ తో సంబంధం లేదని గోరటి చెప్పినా.. మరి మిగతా అంతమంది ప్రస్తావనపై ప్రశ్నించినప్పుడు.. జయశంకర్ పేరును పెట్టకపోవడం తప్పేనని గోరటి ఒప్పుకున్నారు. కచ్చితంగా జయశంకర్ పేరు ఉండాల్సిందేనని, జరిగిన పొరపాటుకు చింతిస్తున్నానని కూడా తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు గోరటి వివరణ ఇచ్చారు. మరోవైపు సినిమా ఇంకా విడుదల కాలేదు కాబట్టి.. ఆ పాటను సవరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును చేరుస్తానని చెప్పడం విశేషం.
ఎంతో భవిష్యత్తున్న రాకేశ్ ఎందుకిలా చేశాడు?
జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న రాకేశ్ సొంత జిల్లా వరంగల్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు. పక్కా హైదరాబాదీ అయిన రాకేశ్ కు ప్రొఫెసర్ జయశంకర్ గురించి తెలియదనుకోవాలా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ను హైలైట్ చేస్తూ తీస్తున్న సినిమాలో కేసీఆర్ ఎంతో గౌరవించే, ఆరాధించే జయశంకర్ పేరు లేకపోవడం రాకేశ్ వైఖరిపై అనుమానాలకు తావిస్తోందంటున్నారు తెలంగాణ సినీ ఇండస్ట్రీ నిపుణులు. జయశంకర్ పేరు పెట్టాలని నిర్మాత సూచించకపోవడాన్ని గోరటి వెంకన్న కారణంగా చూపుతున్నా.. ఒక తెలంగాణవాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, బహుళ జనం ఆదరిస్తున్న ఆయన జయశంకర్ పేరును విస్మరించడంపై నొచ్చుకున్నారు. మరి రాకేశ్ కావాలనే ఆయన పేరును తీసుకోరాదని గీత రచయితకు సూచించారా అన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీనిపై రాకేశ్ వివరణ కోసం ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చి.. ఈటీవీలో సూపర్ రేటింగ్ ఉన్న ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రామ్ లో రాణిస్తున్న రాకేశ్ లాంటి తెలంగాణ కళాకారులు.. తెలంగాణకు చిరునామా లాంటి జయశంకర్ సార్ ను విస్మరించడం విమర్శలకు దారితీస్తోంది. వెండితెర మీద ఎంతో భవిష్యత్తు కోసం ముందుకెళ్తున్న రాకేశ్ తదుపరి ఎలాంటి చర్య తీసుకుంటాడోనన్న ఆసక్తి రేగుతోంది.
Comments
Post a Comment
Your Comments Please: