తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు రేవంత్ రెడ్డి. పట్టిన పట్టు వదలడు అనే పేరున్న రేవంత్ రెడ్డి.. తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా అలాగే మలుచుకున్నారు. రాజకీయ జీవితాన్ని తాము కోరినట్టుగా మలుచుకున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ ఒకరు. చాలా మందికి అదృష్టవశాత్తూ సీఎం కుర్చీ దొరకవచ్చు. కానీ రేవంత్ కు ఆ సీటు అదృష్టవశాత్తూ దొరకలేదు. తన ప్రయాణాన్నే సీఎం కుర్చీ దిశగా టార్గెట్ చేసి పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు. ఆ విషయాల గురించి మరింత డీటెయిల్డ్ గా మాట్లాడుకునే ముందు.. రేవంత్ తెలంగాణ సీఎం అయిన సందర్భం గురించి చెప్పుకోవాలి.
నవంబర్ 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కు క్లియర్ కట్ మెజారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం. ఈ కృషిలో రేవంత్ పాత్రను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఇతర కాంగ్రెస్ నేతలెవరూ చేయని పనిని రేవంత్ చేసిపెట్టారు. ప్రజల్లో నమ్మకం కలిగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తామేం చేస్తారో రేవంత్ చెప్పారు. ఆయన మాటల్ని ప్రజలు నమ్మారు. రాష్ట్ర కాంగ్రెస్ సైన్యాన్ని నడిపించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్.. టీ-పీసీసీ చీఫ్ గా అనుకున్న లక్ష్యం ఛేదించి.. పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా నేతలందరి మొహాల్లోనూ ఆనందం విప్పారింది. ఒక భారీ లక్ష్యాన్ని అందుకోవడానికి రేవంత్ అనే నేత తమకు ఆసరా అయ్యాడన్న ఫీలింగ్ కార్యకర్తలందరిలోనూ కనిపించింది.
ఇక సీఎల్పీ నేతగా ఎవర్ని ఎన్నుకోవాలి? ముఖ్యమంత్రి ఎవరవుతారు? అనే కీలకమైన అంకానికి చేరుకున్న తరువాత 48 గంటలపాటు జరిగిన చర్చోపచర్చల్లో ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన డీకే శివకుమార్, రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కీలకంగా వ్యవహరించారు. 64 మంది ఎమ్మెల్యేలతో చర్చించారు. అభిప్రాయాలు తీసుకున్నారు. అభ్యంతరాలను మనసులో పెట్టుకున్నారు. సీఎం కుర్చీపై కన్నేసిన సీనియర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారి అభ్యంతరాలేంటో కనుకున్నారు. ప్రయారిటీస్ నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో పూర్తి నివేదిక తయారు చేసి ఏఐసీసీ పెద్దలకు సమర్పించారు. దీంతో బంతి ఢిల్లీ పెద్దల కోర్టులో పడింది. రేవంత్ ను సీఎంగా చేయడంలో అభ్యంతరాలు వెలిబుచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టివిక్రమార్క.. అలాగే మధ్యవర్తులు డీకే శివకుమార్, ఠాక్రేలు ఢిల్లీకి చేరుకొని తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రయారిటీస్, ఆప్షన్స్ గురించి హైకమాండ్ కు పూసగుచ్చినట్టు వివరించారు. అందరి సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలు తెలుకొని, వారి అనుమానాలు తీర్చాక.. రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించింది అధిష్టానం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించారు. రేవంత్ ను డైనమిక్ లీడర్ గా అభివర్ణించిన వేణుగోపాల్.. తెలంగాణ ప్రజలకు తాము ఇచ్చిన హామీలు పూర్తి చేయడంలో నిమగ్నమవుతామని చెప్పారు.
రేవంత్ ను సీఎల్పీ నేతగా ప్రకటించడంతో ఆయనకు ఉండే అన్ని అవరోధాలూ తొలగిపోయినట్టయింది. 7వ తేదీన రేవంత్ తన టీమ్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారైంది. దీంతో తెలంగాణ రాజకీయాల్లో, పరిపాలనలో మరో అధ్యాయం మొదలవుతోంది. కేసీఆర్ పదేళ్ల ప్రభుత్వాన్ని చూసిన తెలంగాణ ప్రజలు.. రేవంత్ ప్రభుత్వం ఎలా ఉంటుందన్న ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: