Skip to main content

వనపర్తి గెలుపు బాటలో నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సుదీర్ఘమైన, చెప్పుకోదగిన చరిత్ర గల పాతకాలపు సంస్థానమే వనపర్తి. ఆత్మాభిమానానికి, పౌరుష పరాక్రమాలకు, కవి గాయక వైతాళికులకు పెట్టింది పేరు.. ఈ వనపర్తి. కాలక్రమంలో అదే ఇప్పుడు నియోజకవర్గంగా మారింది. అలాంటి వనపర్తిలో ఎన్నికల పోరాటం రసవత్తరంగా మారుతోంది. అందుక్కారణం సిట్టింగ్ మినిస్టర్ గా, నీళ్ల నిరంజనుడిగా పేరున్న కేసీఆర్ అనుచరుడు ఒకరైతే.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తెలంగాణ ఆవిర్భవించిన సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి మరొకరు. అయితే ఆయనకు టికెట్ ఇస్తానని ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం.. మేఘారెడ్డిని అభ్యర్థిగా మార్చేసింది. ఇలాంటి సమయంలో వనపర్తిలో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణకు తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. అందులో భాగమైన వనపర్తి జిల్లా పేరుతో ఏర్పడిన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు తీసింది.
ఇప్పుడీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మేఘారెడ్డి మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఎన్నికల రణక్షేత్రంలో పోరు మాత్రం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అన్నట్టుగా సాగుతోంది. మారిన పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో నియోజకవర్గంలో ఆ ఊసు ఎత్తేవారే లేకుండా పోయారట. ఇతరుల బలాబలాల గురించి కాసేపు పక్కన పెడితే.. ప్రధాన పోరు కొనసాగుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల గురించే ప్రస్తుత చర్చంతా సాగుతోంది.

నిరంజన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 2014లో నిరంజన్ రెడ్డి అదే తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకొని బరిలో నిలిచారు. అయితే ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయినా ఓటమికి వెరువకుండా ఆయన ప్రజాక్షేత్రాన్నే అంటి పెట్టుకొని ఉన్నారు. బీఆర్ఎస్ కేడర్, తెలంగాణ ఉద్యమకారులతోనే కలిసి ఉంటూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఆలోచనలను ప్రజల ముందు పెడుతూ వచ్చారు. నీళ్లు లేక, వ్యవసాయం లేక, పడావు పడ్డ భూములను ఏం చేయాలో అర్థం కాక ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నిలపాలో మేధావులతో, ఉద్యమకారులతో, కవులతో కలిసి అనేక చర్చాగోష్టులు నిర్వహించారు. తనకు ఇష్టమైన రంగమైన వ్యవసాయాన్ని వనపర్తిలో ఏ విధంగా కొత్తపుంతలు తొక్కించాలో నిరంతరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన కృషిని గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టి ప్రభుత్వంలో ఆయన సేవలను అకామొడేట్ చేయడం విశేషం. అటు పార్టీ ఫౌండర్ మెంబర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఈ క్రమంలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి 50 వేలకు పైగా బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత వనపర్తి రూపురేఖలే మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2018లో బంపర్ మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.. ఇప్పుడు తాను చేసిన అభివృద్ధిని చూపుతూ ఓట్లు అడుగుతున్నారట. 

మరోవైపు కాంగ్రెస్ నుంచి యువకుడైన మేఘారెడ్డి.. ప్రస్తుత మంత్రి అయిన నిరంజన్ రెడ్డిని ఢీకొంటున్నారు. అయితే మేఘారెడ్డి వాస్తవానికి ఒకప్పుడు నిరంజన్ రెడ్డికి అనుచరుడిగా ఉండేవారట. ఆయన ప్రోత్సాహంతోనే వ్యాపార రంగంలో రాణించారట మేఘారెడ్డి. అయితే రాజకీయాల్లో రాణించాలన్న లక్ష్యంతో మేఘారెడ్డి.. నిరంజన్ రెడ్డికి దూరమై కాంగ్రెస్ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న ఊపే తనను గెలిపిస్తుందని, రేవంత్ రెడ్డి చరిష్మా గట్టెక్కిస్తుందని మేఘారెడ్డి భావిస్తున్నారట. కానీ మేఘారెడ్డికి టికెట్ దక్కడంలో జరిగిన ప్రహసనమే ఆయనకు గుదిబండగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.

వనపర్తి కాంగ్రెస్ టికెట్ మొదట సీనియర్ నేత అయిన చిన్నారెడ్డికే కేటాయించారు. ఆయన పేరునే ప్రకటించారు. దీంతో చిన్నారెడ్డి ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. వనపర్తిలో భారీ ర్యాలీ కూడా తీశారట. ఎప్పుడూ ఖర్చు చేయని చిన్నారెడ్డి.. ఇది తనకు ఆఖరు ఎన్నికగా భావించి.. ఎలాగైనా గెలవాలని చేతికి ఎముక లేకుండా ఖర్చు కూడా చేశారట. అయితే కాంగ్రెస్ లో తెరవెనుక జరిగిన డ్రామాల ఫలితంగా చిన్నారెడ్డికి దక్కిన టికెట్ కాస్తా ఆఖరు నిమిషంలో మేఘారెడ్డి ఎగరేసుకుపోయారు. మరి టికెట్ వేటలో గెలిచిన మేఘారెడ్డి.. ఓట్ల వేటలో కూడా విజయం సాధిస్తారా అన్న చర్చే వనపర్తిలో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారుతోంది. ఆ అంశమే అనుమానాస్పదంగా కూడా మారిందన్న టాక్ బలపడుతోంది.

నిజానికి చిన్నారెడ్డి సోనియా కోటాలోనే టికెట్ దక్కించుకున్నారట. టీ-పీసీసీ చీఫ్, ఇతర స్థానిక లీడర్లతో పని లేకుండా నేరుగా అధిష్టానమే తన పేరు ఖరారు చేసింది. దీంతో కేడర్ అంతా తనకు సపోర్టు చేస్తుందని.. ఇప్పుడున్న హవాలో తాను తప్పకుండా గెలిచి వస్తానని చిన్నారెడ్డి భావించారు. తీరా మేఘారెడ్డిని రీ-కన్ఫామ్ చేయడంతో చిన్నారెడ్డి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఒకవైపు కాంగ్రెస్ కు విధేయుడిగా కనిపిస్తూ.. మరోవైపు తనకు వచ్చిన టికెట్ చేజారిన ఫలితంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయడానికి మనసొప్పడం లేదట. మరోవైపు.. తాను ఈసారి పార్టీకి సహకరించాలంటే.. భవిష్యత్తులో తన కుమారుడైన ఆదిత్యకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకున్నారట చిన్నారెడ్డి. ఈ ఈక్వేషన్ కు హైకమాండ్ ఓకే చెప్పడంతో చిన్నారెడ్డి మేఘారెడ్డికి సహకరిస్తానని కార్యకర్తల సమక్షంలోనే చెప్పారట. అయితే మేఘారెడ్డికి మాత్రం తాను మనస్పూర్తిగా సహకరించడం లేదట. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా ప్రచారంలో అడపాదడపా కనిపించడం మినహా.. మనసు పెట్టి వర్క్ చేయడం లేదట. అటు తన అనుచరులకు మీ ఇష్టం వచ్చినవారికి చేయండి అంటూ తెలివిగా నిశ్శబ్దం పాటిస్తున్నారట. దీంతో అనుచరులు తమ ఇష్టానుసారం కొందరు మేఘారెడ్డికి, మరికొందరు నిరంజన్ రెడ్డి వైపు వెళ్లిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారట.

మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికే టీడీపీ మాజీ నేత, మంత్రిగా పని చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పడంలో సఫలీకృతుడై.. గెలుపును ఖాయం చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు బీడు భూముల్లో నీళ్లు పారించిన నిరంజన్ రెడ్డి.. మరోవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు తీయిస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. అటు కాంగ్రెస్ కేడర్ కూడా కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధిని కాదనలేకపోతోంది. దీంతో మేఘారెడ్డి తొలుత టఫ్ ఫైట్ ఇస్తారన్న అభిప్రాయం కలిగించినా.. మారిన పరిస్థితుల నేపథ్యంలో నిరంజన్ రెడ్డికి గెలుపు అవకాశాలు మరింత మెరుగయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తనకు గురువైన నిరంజన్ రెండోసారి గెలుపును అడ్డుకోవడం.. శిష్యుడైన మేఘారెడ్డి వల్ల అవుతుందా.. అనే చర్చనే వనపర్తిలో నడుస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి కొత్త వ్యక్తి అయిన అనుజ్ఞారెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బరిలో నిలిపింది. ఇక్కడ బీజేపీ గురించి పెద్దగా చర్చలో లేకపోవడం.. నిరంజన్ రెడ్డికి కలిసొస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. రేపు మరేం జరుగుతుందో చూడాలి. 



Comments

Popular posts from this blog

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే