Skip to main content

టి-కాంగ్రెస్ లో ఎన్నడూ లేని జోష్.. కారణం ఇదే


తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఏ రేంజ్ లో ఉందంటే.. గెలుపుకు అర అంగుళం దూరంలోనే ఉన్నామన్న ఫీలింగ్ లో వారంతా ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. అధికారం అందుకోవడం ఖాయమైపోయిందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. సమన్వయ కమిటీ చైర్మన్ గా ఉన్న సీనియర్ నేత జానారెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తన సంతోషాన్ని, ఆనందాన్ని లోపలే దాచుకోవాల్సి ఉండగా.. బహుశా ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతోనో ఏమో గానీ.. సీఎం కుర్చీ మీద కర్చీఫ్ వేసుకునే ప్రయత్నం చేశారు జానా. మరి జానాలాగే మరికొందరు సీనియర్లు కూడా ఇదే వాయిస్ వినిపిస్తారా? కాంగ్రెస్ లో సీనియర్లకు ఎదురవుతున్న పరిస్థితులేంటి?

టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలకు ముందే 6 గ్యారెంటీ పథకాల హామీతో జనంలోకి చొచ్చుకుపోతోంది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల 55 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో టీ-పీసీసీ తొలి జాబితా విడుదల చేసింది. అయితే అందులో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిలో నైరాశ్యం అలముకుందన్న వార్తలు కాంగ్రెస్ లో దుమారం రేపుతున్నాయి. రెండో జాబితా బయటకు రావాల్సి ఉన్నా.. తొలి జాబితాలోనే తమకు చోటు లేనప్పుడు.. ఇంక రెండో జాబితాలో ఎక్కణ్నుంచి ఉంటుందన్న నైరాశ్యం సీనియర్లలో వ్యక్తమవుతోంది. మరికొందరిలో రెండో జాబితాలో తమ పేర్లు కచ్చితంగా ఉంటాయన్న ధీమా కనిపిస్తోంది. అయితే టికెట్లు వచ్చే ఆస్కారం లేదనే సంకేతాలు అందుతుండడంతో పలువురు సీనియర్లు ఎలాంటి పంచాయతీకి తెరతీస్తారో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

టీ-కాంగ్రెస్ రాజకీయాల్లో చాలా సీనియర్ అయిన జానారెడ్డి.. తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జానారెడ్డి.. టీ-కాంగ్రెస్ రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేశారు. హైకమాండ్ దగ్గర ఆయన మాటకు తెలంగాణ ఏర్పాటుకు ముందు వరకు విపరీతమైన చెల్లుబాటు ఉండేది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఒకటైతే.. టీ-పీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు అందుకున్నాక జానా ప్రభ మసకబారుతోంది. అయితే ఆయన రాజకీయ వారసత్వాన్ని పదిలం చేసుకునేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన తన కుమారులను రాజకీయ ప్రవేశం చేయించి.. వారిని అసెంబ్లీకి పంపించి తాను మరింత పెద్ద హోదాలో కొలువుదీరాలని కలలు కంటున్నారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తాను కోరుకోకపోయినా సీఎం పదవి తననే వరిస్తుందని.. తాను పదవుల రేసులో లేకున్నా.. అదృష్టం తననే వరిస్తుందని.. సీఎం కుర్చీ మీద తాను ఎంత మనసు పడ్డారో మెరిసే కళ్లతో వివరించారు. 

జానారెడ్డి వ్యాఖ్యలతో సీనియర్ల మనసులో ఏముందోననే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్లు కన్ఫామ్ చేయకముందే.. బరిలో నిలవకముందే.. గెలుపోటముల భవిష్యత్తు తేలకముందే.. అసెంబ్లీకి వెళ్లేదీ లేనిదీ తెలియకుండానే.. ఏకంగా జనారెడ్డి సీఎం కుర్చీ మీద కన్నేయడం టీ-కాంగ్రెస్ లో దుమారం రేపుతోంది. ఔరా.. జానా.. ఆయన మనసులో ఇంత పెద్ద కోరిక తిష్ట వేసుకుని ఉందా.. అని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడులో జరిగిన కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి.. ఆ విధంగా తన మనసులోని మాటను బయట పెట్టుకున్నారు. 

వాస్తవానికి టీ-కాంగ్రెస్ లో జానా లాంటి సీనియర్లు చాలా మందే ఉన్నారు. కాబట్టి ఆ సీటుకు పోటీ తీవ్రంగా ఉందని.. వారెవరూ నోరు మెదపకముందే, ఇప్పుడే తాను ముచ్చట పడుతున్న విషయాన్ని రివీల్ చేస్తే.. ఇతరులు ఆ మాటెత్తకుండా ఉంటుందన్న ముందుచూపుతోనే జానా అలా చేశారా? అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరి జానారెడ్డి ఎలాగూ సీఎం కుర్చీ మీద మనసు పడ్డారు కదా అని చెప్పి మిగతావారు తమ కోరికను చంపేసుకుంటారా? అలాంటి సెన్సిటివిటీని మెయింటెయిన్ చేసే సంప్రదాయం కాంగ్రెస్ లో ఉండదని.. ఎవరి ఎజెండా, ఎవరి డిమాండ్ వారిదేనని కాంగ్రెస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. 

తన రాజకీయ వారసత్వాన్ని కొడుకులకు సంక్రమింపజేయాలని జానారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలను జిల్లాలోని రెండు చోట్ల నుంచి రంగంలోకి దింపి వారిని గెలిపించుకోవాలని.. మరో సీట్లో తను పోటీ చేసి రాష్ట్రంలో అత్యున్నత పదవిని అలంకరించాలని కలలు కంటున్నారు. అయితే టీ-పీసీసీ పగ్గాలు రేవంత్ చేతికి వచ్చాక జానా లాంటి సీనియర్లకు సైతం ముకుతాడు పడినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈసారి తను అసెంబ్లీ బరిలో ఉండే అవకాశం లేదని తెలిసినప్పటికీ.. సీఎం కుర్చీ గురించి కామెంట్లు చేయడం చర్చాంశంగా మారింది. మరోవైపు జానా తన వ్యాఖ్యలను తానే బలపరుచుకుంటూ.. పీవీ నరసింహారావు కూడా ఎన్నికల్లో గెలవకుండానే సీఎం అయ్యారు కదా.. అలాంటి అవకాశమే తనకూ వస్తుందని.. అలా అపురూపమైన అవకాశం తన్నుకొచ్చినప్పుడు దాన్నెవరూ ఆపలేరని.. మైకు బద్దలు కొట్టారు జానా. ఆ పదవి తనను వెదుక్కుంటూ వస్తే.. ఎన్నికలు జరిగిన ఆరు నెలల తర్వాత తన కొడుకు రాజీనామా చేస్తాడని.. అప్పుడు తానే మళ్లీ ఎమ్మెల్యే అవుతాననీ... అన్నీ ఆలోచించి పెట్టుకుంటున్నారు జానా. 

జానా లాంటి సీనియర్లకు టీ-కాంగ్రెస్ లో కొదువ లేదు. వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, రేణుకాచౌదరి.. లాంటివారు చాలా మందే ఉన్నారు. జగ్గారెడ్డికి సీటు కన్ఫామ్ అయినా.. చాలా మంది ఫైర్ బ్రాండ్లకు సీట్లు దక్కడం అనుమానాస్పదంగానే ఉందంటున్నారు నేతలు. దీంతో ఇప్పుడు సరికొత్త నినాదాలు కూడా ముందుకొస్తున్నాయి. తెలంగాణలో గెలుపును అందుకోబోతున్న పార్టీగా నాయకులందరూ సంబరపడుతున్నా.. తమకు గనక టికెట్ రాకపోతే పార్టీ తడాఖా చూపుతాం అనే రేంజ్ లో పలువురు నేతలు గరం అయిపోతున్నారు. రేణుకాచౌదరి లాంటి సీనియర్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు అయితే గతంలో ఎప్పుడూ లేని సరికొత్త ఈక్వేషన్స్ ముందుకు తీసుకొచ్చి ఢిల్లీ పెద్దలను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుండడం విశేషం. 

టీ-కాంగ్రెస్ సీనియర్లలో బలరాం నాయక్, మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు కూడా ఉన్నారు. అటు సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నందున.. అది సొంత సీటు అయిన షబ్బీర్ అలీ.. సేఫ్ ప్లేస్ చూసుకొని స్థానభ్రంశం చెందాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎల్లారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట. అలాగే మధుయాష్కీ లాంటి నేతలు కూడా స్థాన భ్రంశం చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇలాంటి సీనియర్లకు టాప్ ప్రయారిటీ ఇస్తే.. స్థానిక సీట్ల మీద కన్నేసిన వారి పరిస్థితేంటి? వారిని ఎలా మెప్పించి ఒప్పించడం.. వారు నిశ్శబ్దంగా ఎలా ఉంటారు? ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సమన్వయం చేయాల్సిన జానా లాంటి సీనియర్.. ఆ విధులు వదిలేసి.. తనకే సీఎం కుర్చీ కావాలని మనసు పారేసుకుంటే.. ముందుముందు పార్టీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత