Skip to main content

భారతదేశం పాములకు పాలు పోస్తోందా?

ఆఫ్ఘనిస్థాన్ మనకు శత్రు దేశమా.. మిత్రదేశమా? మిత్రదేశం అనడానికి ఎలాంటి బలమైన ఆధారాలూ లేవు. శత్రుదేశంగా పరిగణించడానికి అనేక కారణాలు కనిపిస్తాయి. మరి ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండానే.. భారత్ పెద్దమొత్తంలో తిండిగింజలు, మెడిసిన్స్‎ను ఎందుకు పంపుతోంది? కనీసం అక్కడి తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇప్పటివరకూ గుర్తించని భారత్.. భారతీయులు కూడా ప్రశ్నించేలా ఆ దేశానికి అంతపెద్ద మొత్తంలో ఆపన్నహస్తం ఎందుకు అందిస్తోంది? 

యుగయుగాలుగా భారతీయులు చూపిస్తూ వస్తున్న ఔదార్యం ముందు ప్రపంచంలోని ఏ దేశమైనా దిగదుడుపేనంటారు. గతేడాది ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు కబ్జా చేసుకొని, అధికారం చేపట్టినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. ముఖ్యంగా భారత ప్రభుత్వం తాలిబాన్ల కదలికల్ని నిశితంగా గమనిస్తూ అడుగులు వేస్తోంది. అమెరికా వెన్నుదన్నుతో కర్జాయ్ పరిపాలించినప్పుడు వెల్లివిరిసిన స్నేహ సంబంధాలు ఒక్కసారిగా అదృశ్యమైపోయి... తాలిబన్ల రాకతో మన దాపునే రాక్షస రాజ్యం పురుడుపోసుకున్నట్లయింది. అయితే తాలిబాన్ల వ్యవహార శైలి, పాలనలో షరియాను పక్కాగా అమలు చేయడం, మహిళలతో అనుసరించే విధానం వంటి అనేక కారణాలతో జనజీవనం స్తంభించింది. ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెరిగాయి. ఉద్యోగ జీవులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి దాపురించింది.దీంతో ఉత్పాదకత పడకేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘన్లకు ఆర్థికంగా సాయం అందించడమే గాక.. వారి ఆకలి తీర్చేందుకు తిండిగింజలు సైతం భారత్ పంపడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండియా పాముకు పాలు పోస్తోందన్న విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆఫ్ఘన్ విపక్ష పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత భారత్ చేస్తున్న సాయాన్ని అపాత్రదానంగా అభివర్ణించడం ఆసక్తి రేపుతోంది. 

అహ్మద్ మసూద్.. 34 ఏళ్ల కుర్రాడు. ఆఫ్ఘనిస్థాన్ పౌరుడు. విదేశాల్లో ఉన్నత విద్యలు చదువుకోవడమే గాక.. ఆఫ్ఘనిస్థాన్ మీద విదేశీ గద్దలు వాలకుండా కాపాడాలని తహతహలాడే ఓ యువనాయకుడు. నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్... N.R.F.A అనే విపక్ష పార్టీ నడిపిస్తున్న యువనేత. ఆఫ్ఘనిస్థాన్ మీద సోవియట్ యూనియన్ పెత్తనాన్ని అడ్డుకునేందుకు గెరిల్లా పోరాటం చేసిన అహ్మద్ షా మసూద్ కుమారుడే ఇతను. ఆఫ్ఘన్ కోసం పోరాడుతూ అమెరికా ట్విన్ టవర్స్ పేల్చివేతకు ముందే అహ్మద్ మసూద్ తండ్రి హతమయ్యాడు. ఆయన పేరు మీదనే అహ్మద్ మసూద్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. తండ్రిబాటలోనే N.R.F.A రాజకీయ పార్టీని కూడా నడిపిస్తున్నాడు. ఇప్పుడీ అహ్మద్ మసూద్ భారత్ పట్ల చేసిన కామెంట్స్ భారత వార్తా ప్రపంచంలో ప్రముఖంగా మారుతున్నాయి. భారత్ నుంచి సాయం అందుకుంటున్న తాలిబాన్లు.. ఆ సాయాన్ని నిజంగా ప్రజల కోసం వెచ్చించడం లేదని, తాము కొన్నేళ్లపాటు కదలకుండా కూచుని తిన్నా తరగనంతగా ఆహార ధాన్యాలను పోగేసుకుంటున్నారంటూ తీవ్రమైన వ్యాఖ్యలే చేశాడు. భారత్ నుంచి తేరగా వస్తున్న ఆహారం మెక్కి.. ప్రజల్ని ఇబ్బందులపాల్జేస్తున్నారని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏకరువు పెట్టాడు. భారత్ అందిస్తున్న సాయాన్ని పునరాలోచించుకోవాలంటూ ఓ సూచన కూడా చేయడం విశేషం. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్ల పాలన మొదలయ్యాక భారత్.. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు. కానీ.. మానవీయ కోణంలో సాయం అందిస్తామని, అమాయకులైన ప్రజల్ని ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుందని తేల్చి చెప్పింది. అన్నట్టుగానే గత ఆరు నెలలుగా అనేక విడతలుగా పెద్దమొత్తంలో గోధుమలు, పప్పులు వంటి ఆహార ధాన్యాలతో పాటు ఎమర్జెన్సీ మెడిసిన్స్ పెద్దమొత్తంలో అందిస్తోంది. ఆఫ్ఘన్ కు అవసరమైన సాయం అందిస్తున్నందుకు, అక్కడ ప్రజాపాలన గాడిన పడేలా ఏజెన్సీలు నెలకొల్పి ఆపన్నహస్తం అందిస్తోంది. రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నిలుపుకునేందుకు కాబూల్ లో రాయబార కార్యాలయాన్ని సైతం తెరచింది. భారత్ చూపుతున్న చొరవకు తాలిబన్లు కూడా పలుమార్లు కృతజ్ఞతలు చెప్పడం గమనించాల్సిన అంశం. 

తాజాగా అహ్మద్ మసూద్ చేసిన వ్యాఖ్యలు భారత్ చేస్తున్న సాయంలో పరమార్థాన్ని శంకించేలా చేస్తుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తాలిబన్ల రాజ్యం ఏర్పడినప్పుడు ఆ ప్రభుత్వంలో తనను కూడా చేరమన్నారని, అయితే తాను అందుకు నిరాకరించానని అహ్మద్ చెబుతున్నాడు. తాలిబన్ల అరాచకాలను అంతం చేయడానికే వారి మీద పోరాడుతున్నానని, అందుకే అడవుల్లో ఉంటూ గెరిల్లా పోరాటానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నానని చెబుతున్నాడు. తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ ను వీడిన అహ్మద్.. తజకిస్తాన్లో అజ్ఞాత జీవితం గడుపుతున్నాడు. దీంతో తాలిబన్లతో తన తండ్రి చేసిన పోరాటాన్ని కొనసాగిస్తానని, ఏనాటికైనా ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్ల చెర నుంచి విడిపిస్తానని ధీమాగా చెబుతున్నాడు. పాముకు పాలు పోయడం భావ్యం కాదంటూ భారత్ కు సూచనలు చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తాలిబన్ సర్కారును గుర్తించని భారత్.. అహ్మద్ మసూద్ లాంటి కుర్రాళ్లతో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు.. భారత్ సాయం కోసం పక్కనున్న బంగ్లాదేశ్ కూడా అర్థిస్తోంది. కానీ అక్కడున్న మతవాదుల ఆట కట్టించడంలో బంగ్లాదేశ్ పీఎం షేక్ హసీనా సైతం చేష్టలుడిగి ప్రేక్షకపాత్ర వహిస్తోందన్న విమర్శలున్నాయి. ఆఫ్ఘనిస్థాన్ కు అయినా.. బంగ్లాదేశ్ కు అయినా భారత్ సాయం చేసే క్రమంలో కొన్ని ముఖ్యమైన షరతులైనా విధించాలన్న సూచనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. 

గతేడాది ఆఫ్ఘన్లో తాలిబన్ సర్కారు ఏర్పడినప్పుడు.. భారత్ లో కొందరు మేధావులు, పలు పార్టీలు కూడా తాలిబన్లతో చేయి కలపాలని, వారి ప్రభుత్వాన్ని గుర్తించాలన్న డిమాండ్ వినిపించింది. రాజకీయ పార్టీల్లో ఆ డిమాండ్ ఎంఐఎం నేత అసదుద్దీన్ నుంచి ప్రముఖంగా వినిపించింది. భారత్ మీద దాదాపు ఒత్తిడి తెచ్చినంత పనిచేశారు ఒవైసీ. అందుకు భిన్నంగా అహ్మద్ మసూద్ మాత్రం.. భారత్ చర్యను పునరాలోచించుకోవాలంటున్నాడు. అయితే భారత్ ఎలాంటి ఒత్తిడికీ లోను కాకుండా.. సాయం అందిస్తూనే.. తాలిబన్ల చర్యలను నిశితంగా గమనిస్తోంది. ఈ క్రమంలో అజ్ఞాత ప్రాంతం నుంచి అహ్మద్ మసూద్ ఇంటర్వ్యూ ద్వారా ప్రపంచానికి మనోభావాలు తెలియజేయడం.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది.. ఎలాంటి కొత్త ఈక్వేషన్లు పుట్టుకొస్తాయన్న ఉత్కంఠకు దారితీస్తోంది. 

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

శ్రీశైల క్షేత్రంలో ఫొటోలు తీయబడును

ఎంతో చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రతి భక్తుడే గాక ప్రతి భారతీయుడు కూడా ఆసక్తి చూపుతాడంటే అతిశయోక్తి కాదు. అందుకే శ్రీశైల  మహా క్షేత్రానికి భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక యాత్రలకే గాక అద్భుతమైన టూరిస్టు ప్రాంతంగా ఉండడంతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అయితే శ్రీశైలానికి ఉండే తాకిడి మామూలుగా ఉండదు. అయితే అన్ని ప్రముఖ హిందూ దేవాలయాల్లో ఉన్నట్టుగానే శ్రీశైలంలో కూడా ఫొటోలు, వీడియోలు తీయరాదనే  నిబంధన  ఉంది. ఎవరైనా కెమెరాలతో, సెల్ ఫోన్లతో లోనికి ప్రవేశించడానికి వీల్లేదు. అలా చేస్తే వాటిని ఆలయ సిబ్బంది జప్తు కూడా చేస్తారు. భద్రతా కారణాల రీత్యా కూడా శ్రీశైలం విషయంలో ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే నిబంధనలు మాత్రం పేరుకే స్ట్రిక్టుగా ఉన్నాయి గానీ.. ఆచరణలో మాత్రం అంతా డొల్లేనంటున్నారు భక్తులు.  ఎందుకంటే శ్రైశైలంలో దలారీ ఆనంద్ ను సంప్రదిస్తే ఎవరైనా, ఎక్కడైనా ఫొటో తీసుకోవచ్చు. అడిగినంత మొత్తం చెల్లిస్తే అమ్మవారి సన్నిధిలోనైనా, అయ్యవారి సన్నిధిలోనైనా.. ఎక్కడైనా సరే క్యాష్ పడేస్తే ఫొటో క్లిక

అన్ని సర్వేలూ అదే చెబుతున్నాయి.. ఒక్కటి తప్ప

ఓటరన్న తన పని తాను కానిచ్చేశాడు. తనను సంప్రదించిన పార్టీలతో ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు. మీట నొక్కాల్సిన చోట నొక్కాడు. నిశ్శబ్దంగా తన రొటీన్ వర్క్ లోకి వెళ్లిపోయాడు. మరి ఆ ఓటరు ఏ మీట నొక్కాడు.. ఎవరి మీటరు మార్చబోతున్నాడు.. ఎవరి తలరాత మారబోతుంది? మునుగోడులో ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఆ కీలకమైన విషయాలు మీకోసం.  మునుగోడులో పరుగుపందెంలా మారిన ఉపఎన్నికలో హుజూరాబాద్ ఫలితం రిపీట్ కాకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్... మరో హుజూరాబాద్ లా మార్చేయాలన్న వ్యూహంతో బీజేపీ శ్రేణులు పనిచేశాయి. సర్వే సంస్థలు కూడా ఈ పోటీ తీవ్రతను అర్థం చేసుకొని.. అదే స్థాయిలో ఓటర్ల నాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. అత్యధిక సర్వే సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని అంచనా వేయగా.. ఒకటీ, అరా సర్వే సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఆయా సర్వే సంస్థల రిపోర్టును ఆసరా చేసుకొని పార్టీలు కూడా గెలుపు తమదేననే ధీమాలో ఉన్నాయి.  థర్డ్ విజన్ రీసెర్చ్ నాగన్న ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం టీఆర్ఎస్ 48 నుంచి 51 శాతం ఓట్లు సాధిస్తుంది. బీజేపీ 31 నుంచి 35 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంటుందని పేర్కొంది. 13 నుంచి 15 శాత