Skip to main content

ఈటల కోటలో గెల్లు గెలుపు ఖాయమేనా?

అంచనాలకు అందనిదే రాజకీయం. ఊహించని పరిణామాలు జరిగే వేదికే ఎన్నికల రణక్షేత్రం. అందులోనూ తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయమై, టీఆర్ఎస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈటల రాజేందర్ ను ఢీకొట్టడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి ఈటలను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎదుర్కొనేందుకు అత్యంత సామాన్యుడైన గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అనూహ్యమైన పాచికలు వేసి శత్రువు అంచనాలు తల్లకిందులు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మస్తిష్కమే వినూత్న ఆలోచనల కర్మాగారం. ఏ ఆలోచన వెనుక ఏ పరమార్థం దాగి ఉందో తెలుసుకోవడం సాధారణ రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. అలాంటి ఓ వినూత్నమైన ఎన్నికల ఎత్తుగడే గెల్లు శ్రీనివాస్ ఎంపిక. 

టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు అసలు సిసలు చిరునామా. ఆ ఉద్యమ తోటలో పూసిన ఒక పువ్వే గెల్లు శ్రీనివాస్. అత్యంత సామాన్యమైన యాదవ కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాస్ ను ఈటల మీదికి పోటీకి దింపడం, హుజూరాబాద్ లో ప్రజాభిప్రాయాన్ని టీఆర్ఎస్ కు క్రమంగా అనుకూలంగా మార్చుకోవడం, అందుకోసం తన పార్టీ పరివారం యావత్తునూ హుజూరాబాద్ కు రప్పించడం, ఈటల క్యాంపులో అతిశయించిన ఆత్మవిశ్వాసం వెన్ను విరవడం... ఇదంతా కేసీఆర్ మార్కు రాజకీయ చాణక్యం. అందుకే బతుకమ్మ, దసరా పండుగల ముందువరకు ఉన్న అంచనాలు కాస్తా తారుమారవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్, కేటీఆర్ ల నమ్మకమైన అనుచరుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ గెలుపు అవకాశాలు మెరుగవుతున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక సర్వేలు తొలుత ఈటలకే గెలుపు అవకాశాలున్నాయని తేల్చిచెప్పినా.. కొద్దిరోజులుగా గెల్లుకు వాతావరణం అనుకూలిస్తోంది. మారుతున్న స్థానిక ప్రజల అభిప్రాయాలే అందుకు నిదర్శనం. 


బలపడుతున్న గెల్లు పేరుకు కారణాలివే..
ఈటల బీసీ సామాజికవర్గం నుంచే వచ్చినా తెలంగాణ రాజకీయ నాయకులు అందరి కంటే ధనవంతుడన్న పేరుంది. అలా చెప్పుకోవడాన్ని ఈటల కూడా ప్రెస్టీజ్ గా ఫీలవుతారు. అందుకు భిన్నంగా గెల్లు శ్రీనివాస్ ఓ నిరుపేద యాదవ కుటుంబం నుంచి వచ్చిన సాదాసీదా ఉద్యమకారుడు. ఉద్యమకాలంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపునందుకొని అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఓయూ విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లు కుటుంబానికి హుజూరాబాద్ లో కూడా మంచి పేరుంది. గెల్లు తండ్రికి సైతం సౌమ్యుడిగా క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే కేసీఆర్ గెల్లును ఎంపిక చేశారు. అదే ఇప్పుడు వర్కవుటయ్యే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. 


అందుకు కారణాలు ఏంటంటే.. ఓ పరిపాలుకుడిగా కేసీఆర్ తీసుకొచ్చిన ప్రజాసంక్షేమ పథకాలేనని చెప్పాలి. కేసీఆర్ ఎంత పర్ఫెక్టుగా పాచికలు వేస్తారో.. ప్రజాసంక్షేమం విషయంలో అంతే మానవీయత ప్రదర్శిస్తారు. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ ఏడేళ్ల పాలనే అందుకు తిరుగులేని సాక్ష్యం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే నానుడి మూలాలేంటో తెలిసిన కేసీఆర్... పల్లెల్లో వృద్ధులకు వచ్చే కంటి జబ్బులు నయం చేయడాన్ని ఓ ఉద్యమ రూపంలో తీసుకున్నారు. వృద్ధులందరికీ ఉచిత కంటివైద్యంతో పాటు అవసరమైన అందరికీ ఆపరేషన్ కూడా చేసిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవు. అది తెలంగాణలో, కేసీఆర్ హయాంలో మాత్రమే సాధ్యమైంది. అంతేకాదు.. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో ఈడొచ్చిన ఆడపడుచులకు పెళ్లిళ్లు చేస్తూ ప్రతి తండ్రికీ నేనున్నానంటూ దేవుడిచ్చిన పెద్దకొడుకయ్యారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తూ వారి జీవితాలకు కనీస భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం నెలనెలా ఇచ్చే 3 వేలతో కనీస అవసరాలు తీరుతుండడంతో ఎందరో వికలాంగుల ముఖాల్లో ఆత్మగౌరవపు ఛాయలు కనిపిస్తుండడం గమనించాల్సిన అంశం. ఇవే కాదు.. తీవ్రమైన జబ్బులో, అనుకోని ప్రమాదాలో ఎదురై ఆపదల్లో చిక్కుకునేవారినీ కేసీఆర్ విస్మరించలేదు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎంతో మంది బాధితుల బాధలు తీర్చారు కేసీఆర్. 


కేసీఆర్ చేపట్టిన మరో ప్రజాపథకమే రైతుబంధు. ఆరుగాలం కష్టించి ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు.. వాతావరణం అనుకూలించకనో, చీడపీడల వల్లనో పంటనష్టం ఏర్పడితే దాన్నుంచి కోలుకునే మార్గమే లేదు. పంటకు గ్యారెంటీ కోసం, రైతన్నకు భరోసా కోసం ప్రవేశపెట్టిందే రైతుబంధు. ఎకరానికి ఐదువేల సాయం చొప్పున రెండు పంటలకు 10 వేల సాయం... అంటే ఏటా ఒక్కో ఎకరాకు పదివేల చొప్పున తెలంగాణలోని దాదాపు 65 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చారు. తనను స్వయంగా రైతుబిడ్డగా చెప్పుకునే కేసీఆర్.. రైతుల కోసం తీసుకొచ్చిన సంస్కరణాత్మకమైన పథకంగా మంచిపేరు తెచ్చుకుంది. ఆయన తీసుకొచ్చిన మరో అద్భుతమైన పథకమే దళిత బంధు స్కీమ్. సామాజికంగా చిన్నచూపుకు, అవమానాలకు గురవుతున్న ఎస్సీల్లోని ఒక్కో కుటుంబాన్ని ఎంచుకొని అందరికీ రూ. 10 లక్షల వంతున ఖర్చు చేస్తామని, అవసరమైతే ఇందుకోసం లక్ష కోట్లయినా వెచ్చిస్తామని చెప్పి యావత్ దళిత ప్రజల మనసు చూరగొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తాగునీరు, సాగునీరుకు ఢోకా లేకుండా చేశారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థుల గెలుపును ఖాయం చేస్తాయనేది కేసీఆర్ విశ్వాసం. ఆయన విశ్వాసమే ఇప్పుడు నిజం కాబోతుందన్న అంచనాలు బలం పుంజుకుంటున్నాయి. 
మరోవైపు ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ లోనే మకాం వేయడం గెల్లుకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ప్రజాక్షేత్రంలో తనకున్న సుదీర్ఘమైన అనుభవంతో, ప్రజానాడిని ఒడిసిపట్టడంలో మొనగాడిగా పేరున్న హరీశ్.. గెల్లు గెలుపును భుజాలమీద వేసుకోవడం, ఊరూరా ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలు రూపొందించడం, దగ్గరుండి అమలు చేస్తుండడం, అన్ని సామాజికవర్గాలతో మీటింగ్ లు పెట్టించడం, గెల్లు గెలిస్తే నియోజకవర్గానికి జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తుండడం.. ఇవన్నీ ప్రజల ఆలోచనా స్థాయిని  మార్చేశాయని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మిగిలిన రెండున్నరేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రజలను కన్విన్స్ చేస్తున్న హరీశ్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యే అవకాశాలు మెరుగయ్యాయంటున్నారు. ఈటల గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదని, కానీ గెల్లు గెలిస్తే అదనపు ప్రయోజనాలు ఎన్నో అందుకోవచ్చనే  పాయింట్ మీద ప్రజలు పునరాలోచనలో పడ్డారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 


అనూహ్యంగా తెరమీదికొచ్చిన గెల్లు.. అంతే ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఓయూ స్టూడెంట్ గా వర్గాతీత, కులాతీత భావనలు ఒంట పట్టించుకున్న గెల్లు.. నియోజకవర్గంలోని  అన్ని గ్రామాల్లో అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. తాను గెలిస్తే వచ్చే ఎన్నికల లోపు ప్రభుత్వం మరింత అభివృద్ధిని చేసి చూపిస్తుందని, ఈటలను గెలిపిస్తే ప్రభుత్వానికేమీ  నష్టం రాకపోగా.. నియోజకవర్గం ఎంతో కోల్పోతుందని తనదైన పంథాలో కన్విన్స్ చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ కూడా ఇవ్వడం విశేషం. ఇటీవల జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు... ఇలా అందరూ కూడా తమ కార్యక్షేత్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ  అప్రమత్తం చేశారు. మేనిఫెస్టోలో లేని పనులు చాలావరకు పూర్తిచేశామని, అయినా ప్రజలకు తానిచ్చిన మేనిఫెస్టోలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా రానున్న రెండున్నరేళ్లలో   పూర్తి చేయడం జరుగుతుందంటూ ప్రజాప్రతినిధులందరికీ భవిష్యద్దర్శనం చేశారు. ఓసారి అసెంబ్లీలో కేసీఆర్ ఏమన్నారంటే.. తన దగ్గర అద్భుతమైన రెండు అస్త్రాలు ఉన్నాయని, సమయానుకూలంగా వాటిని ప్రజల ముందు పెడతానని, ఆ అస్త్రాలే ఇతర రాజకీయ పార్టీల బ్రహ్మాస్త్రాలుగా మారతాయని, ప్రజా సంక్షేమం విషయంలో కనీవినీ ఎరుగని మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పడం గమనించాల్సిన అంశం. ఇదే విషయాన్ని గెల్లు శ్రీనివాస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరికీ చెబుతూ విజయావకాశాలను మెరుగు పరుచుకుంటున్నారని నియోజకవర్గ పౌరులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి గెల్లు విజయావకాశాలు గతంలో కంటే బాగా మెరుగవడం కాదనలేని వాస్తవంగా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈటల లాంటి యోధుణ్ని ఓ యువనాయకుడు గెల్లు ఢీకొనడం మొత్తానికి ఆసక్తికరంగా మారింది. - T. Rameshbabu senior journalist

Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల