Skip to main content

భారత్ ఆక్రమణలో మావో జెడాంగ్ థియరీనే చైనా అమలు చేస్తోందా?

అరుణాచల్ ప్రదేశ్ లోని భూభాగాన్ని చైనా ఆక్రమించడం, అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేయడం సంచలనం రేపుతోంది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించడం ఇవాళ కొత్త కాదు. కానీ భారత్ చైనాను విజయవంతంగా నిలువరిస్తోంది. ఈ విషయం పక్కన పెడితే చైనా అరుణాచల్ మీద ఎందుకు కన్నేసిందనేదే ముఖ్యాంశం. 

ఎలా బయటపడింది?

అమెరికాలోని ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది. ఆ ఇమేజెస్ గత నవంబర్ లోవి. తాజా ఫొటోల్లో కొత్త ఇళ్ల సముదాయం కనిపించింది. అదే చోట 2019 ఆగస్టులో ఇళ్లేవీ లేవు. ఇళ్లు నిర్మించిన ప్రాంతం భారత్-చైనా సరిహద్దు నుంచి అరుణాచల్ భూభాగంలో దాదాపు 5 కి.మీ. లోపలికి వచ్చేసింది. అంటే ఏడాదిలో చైనా అక్కడ శాశ్వత మానవ నివాసాలను నిర్మించిందన్నమాట. సారీ చూ అనే నది ఒడ్డున చైనా పౌరులకు శాశ్వత నివాసాలు నిర్మిస్తోంది. చైనా పౌరులు కూడా ఇప్పుడక్కడ తరచుగా కనిపిస్తున్నారు. దీనిపై స్థానిక బీజేపీ ఎంపీ కూడా కేంద్రాన్ని అలర్ట్ చేశాడు. 

చైనా ఎందుకిలా చేస్తోంది?

చైనా భారత భూభాగం మీద కన్నేయడమనేది కొత్త కాదు. ఆక్రమించడానికి చైనా ఎప్పట్నుంచో కాచుకొని ఉంది. నెహ్రూ హయాంలోనే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. ఒక్క భారతే కాదు చైనాతో జపాన్, ఫిలిప్పీన్స్, మలేషియా, తైవాన్ వంటి అనేక దేశాలకు సరిహద్దు వివాదాలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో మిలిటరీ విన్యాసాలు చేస్తూ, అక్కడి దీవుల చుట్టూ భారీగా సైన్యాన్ని మోహరించి ఆయా పాలకుల్ని, ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. పరిస్థితిని యుద్ధం దాకా తీసుకెళ్లకుండా కేవలం భయపెట్టడం ద్వారా ఆధిపత్యం సాధించాలనేది చైనా వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలో సహజ వనరులు, మానవ వనరులతో ఉన్న భారత్ మీద కన్ను పడకపోతే ఆశ్చర్యం కానీ.. పడటంలో ఆశ్చర్యం ఏముంది? 

భారత ఉపఖండంతో చైనాను కలుపుతున్న భూభాగం టిబెట్. టిబెట్ ను కబ్జా చేస్తే భారత చివరి భూభాలు సులభంగా వశమవుతాయనేది చైనా కుట్ర. ఈ కుట్రకు రూపకర్త ఆధునిక  చైనా ప్రగతి పాలకుడుగా అందిరికీ తెలిసిన మావో జెడాంగ్. ఆయన చెప్పిందే ఫైవ్ ఫింగర్ థియరీ. ఈ థియరీ ప్రకారం టిబెట్ అనే పంజా లాంటి భూభాగాన్ని ముందుగా కబ్జా చేసుకుంటే దానికి కొనసాగింపుగా ఉన్న లద్దాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ అనే భారత ఉపఖండంలోని ఐదు వేళ్ల లాంటి ప్రాంతాలపై అతిసులతభంగా అదుపు సాధించవచ్చు. ఇది మావో ప్రతిపాదించి, కమ్యూనిస్టు క్లాసుల్లో ప్రవచించిన థియరీగా చైనాలో చాలా పాపులరైంది. అదే సూత్రాన్ని ఇప్పటి చైనా పాలకులు కూడా తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. ఈ థియరీలో భాగంగా ఇప్పటికే టిబెట్ ను స్వాధీనపరుచుకుంది చైనా. దలైలామాకు మనం ఆశ్రయం కల్పించామన్న వంకతో 1962లో యుద్ధానికి దిగింది. ఆ తరువాత మైళ్లకొద్దీ భూభాగాన్ని కబ్జా చేసింది. ఈ క్రమంలోనే మొన్న లద్దాఖ్ లో దాడి, భారత్ తో సరిహద్దు విషయంలో నేపాల్ తో జోక్యం చేసుకోవడం, నేపాల్ ప్రజల్లో భారత్ పట్ల అనుమానాలు కలిగించేందుకు ప్రయత్నించడం, తాజాగా అరుణాచల్ లో ప్రవేశించడం.. ఇలాంటివన్నీ మావో జెడాంగ్ థియరీ అమలులో భాగమేనని గమనించాలి. 

ఆక్రమించిన అరుణాచల్ భూభాగం మీద చైనాకు హక్కుందా?

చైనా అరుణాచల్ ను ఆక్రమించడానికి, అది తన భూభాగంలోనే ఉందనడానికి చైనా పాతకాలం నాటి పనికిరాని ఓ కారణాన్ని సాకుగా తీసుకుంది. అదేంటంటే.. 1904లో ఇండియన్ బ్రిటిష్ సైన్యం టిబెట్ మీద దాడి చేసింది. అప్పుడు టిబెట్ దలైలామా పాలనలోనే ఉండేది. అయితే బ్రిటిషర్స్ దాడితో దలైలామా మంగోలియా వెళ్లి తల దాచుకున్నాడు. ఆ తరువాత 9 ఏళ్లకు దలైలామా మళ్లీ టిబెట్ వచ్చి పరిపాలన చూసుకోవడం ప్రారంభించాడు. ఆయన పాలన 1913-1950 దాకా సాగింది. 1950లోనే టిబెట్ ను చైనా ఆక్రమించింది. చైనా ఆక్రమణ నుంచి టిబెట్ లోని తవాంగ్ ను తప్పించడానికి దలైలామా అధికారికంగా భారత్ లో కలిపేశాడు. ఇదే తవాంగ్ ఒప్పందం. తవాంగ్ నే ఎందుకు కలిపాడంటే తవాంగ్ అనేది టిబెట్ లోని బౌద్ధ సన్యాసులకు ఒక గుండెకాయ లాంటి ప్రాంతం. బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబించే అనేక ఆరామాలు, భారీ కట్టడాలు, శిక్షణా తరగతులు నిర్వహించుకునే ఏర్పాట్లు తవాంగ్ లోనే ఉన్నాయి. ఇలా తవాంగ్ అనేది టిబెట్ కు సాంస్కృతికంగా కేంద్ర ప్రాంతంలాంటిది. ఇది భారత్ లో అరుణాచల్ ను ఆనుకుని ఉన్న చిన్నపాటి భూభాగం. ఆ ప్రాంతాన్ని భారత్ లో కలపడం ద్వారా చైనా నుంచి తప్పించవచ్చని దలైలామా ముందుచూపుతో ఆ పని చేశాడు. అయితే టిబెట్ భూభాగమంతా నాదే అంటున్న చైనా.. కావాలనే ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అరుణాచల్ లో స్థిరనివాసాలు ఏర్పాటు చేయడం వెనుక ఆ భూభాగం టిబెట్ ది కాబట్టే అనే చెప్తూ తొండాట ఆడుతోంది. వాస్తవానికి టిబెట్ గతంలో ఎప్పుడూ చైనా ఆధీనంలో లేదు. 17వ శతాబ్దం నుంచి అందుబాటులో ఉన్న టిబెట్ చరిత్రను, సాహిత్యాన్ని పరిశీలించినా ఇదే ధ్రువీకరిస్తోంది. ఇంకా చెప్పాలంటే చైనాలోని గాంసు, యునాన్ అనే ప్రావిన్స్ కూడా టిబెట్ లో భాగంగానే ఉండేవి. 1950 వరకు కూడా టిబెట్ స్వతంత్ర దేశమే. స్వతంత్ర దేశంగా భారత్ లో కలిపిన భూభాగాన్ని చైనా తన ఖాతాలో వేసుకోవడమే కాదు.. తన మ్యాపుల్లో కూడా కనిపించకుండా చేసింది. ఈ ఒక్కటే కాదు చైనా మ్యాపుల్లో భారత సరిహద్దు ప్రాంతాలు అనేకం కనిపించకుండా పోయాయి. 

ఇప్పుడేం జరుగుతుంది?

భారత్ ఇప్పుడేం చేయాలి.. ఏం చేస్తుందనేది కీలకమైన అంశం. భారత్ ముందున్నవి మూడు మార్గాలు. 1) చైనాతో యుద్ధం చేసి గెలుపొందడం. 2) ఆర్థికంగా దెబ్బతీయడం. 3) అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టి చైనాను ఏకాకిని చేయడం. ఈ మూడింట్లో మొదటిది ఆచరణ సాధ్యమైంది కాదు. మిగతా రెండు మార్గాలనూ భారత్ ఎంచుకుంది. చైనాతో సంబంధాలు పెద్దగా ప్రభావితం చేసుకోకుండా దాన్ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ఉన్న మార్గాలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. కుయుక్తులతో దేశంలోకి ఎంటరవుతున్న వ్యక్తులను, సంస్థలను ఏరిపారేస్తోంది. చైనా టెక్నాలజీ విశృంఖలత్వాన్ని అదుపు చేస్తోంది. అంతర్జాతీయంగా చైనా మీద ఒత్తిడి తేవడంలోనూ సఫలమైంది. ముఖ్యంగా అమెరికా నుంచి భారీ ఎత్తున మద్దతు కూడగట్టింది. మొన్న డిసెంబర్ లో అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టమే అందుకు నిదర్శనం. టిబెట్ కు సంబంధించి దలైలామా ఎన్నిక విషయంలో చైనా జోక్యాన్ని తాము సహించబోమని.. టిబెట్ ప్రజలు, బౌద్ధ సన్యాసులు, టిబెట్ పౌరులు స్వేచ్ఛగా దలైలామాను ఎన్నుకోవాలని అమెరికా చట్టరీత్యా హెచ్చరించింది. ఇది టిబెట్ కు వాషింగ్టన్ ఇస్తున్న రాజముద్రిక లాంటి మద్దతు. దీనిపై చైనా తీవ్రమైన అసహనం వ్యక్తం చేసింది. ఇది "మా అంతర్గత" వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఖండించింది. అమెరికా ఇంత స్పష్టమైన వైఖరి తీసుకోవడం వెనకాల భారత్ చేసిన కృషి అద్భుతమైంది. అంతేకాదు... మోడీ మొదటిసారి ఎన్నికైన తరువాత వరుస విదేశీ టూర్లు పెట్టుకున్న ఎజెండా కూడా ఇదే. చైనాతో సరిహద్దు సమస్యలు ఎదుర్కొంటున్న జపాన్, ఫిలిప్పీన్, మలేషియా వంటి అనేక దేశాలతో మోడీ చర్చలు ఒక అవగాహనకు వచ్చేలా జరిగాయి. కాబట్టి చైనా మీద భౌతిక దాడి కన్నా వ్యూహాత్మకంగా ముప్పేట దాడి చేయడాన్నే భారత్ ఎంచుకుంది. ఇదే ఇప్పుడు దానికి మింగుడుపడని అంశం. కానీ తన మొండివైఖరి వల్ల చైనా మూర్ఖంగా వ్యవహరించి కయ్యానికే కాలు దువ్వుతుందా.. లేక ఒక్కొక్కటిగా తన చుట్టూ ఉన్న అందరినీ శత్రు దేశాలుగా మార్చుకుంటుందా అనేది రాబోయే రోజులే నిర్ణయిస్తాయి. 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల