మన దేశానికి ఇప్పటికైతే ఒకటే రాజధాని ఉంది. అది ఢిల్లీ. రెండో రాజధాని కూడా ఉందని, అది హైదరాబాదేనని ప్రముఖ దినపత్రిక ఆంధ్రప్రభ కన్ఫామ్ చేస్తోంది. గురువారం (29-10-2020) హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీ లోనే హైదరాబాద్ రెండో రాజధాని అంటూ కన్ఫామ్ చేసేసింది ఆ పేపర్ ఎడిటోరియల్ టీమ్. బుల్లెట్ ట్రెయిన్ ద్వారా "నాలుగు గంటల్లో ముంబైకి" అనే వార్తను హైలైట్ చేస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి దేశ రెండో రాజధాని హైదరాబాద్ కు అతి తక్కువ సమయంలో చేరుకోవచ్చని, దీనిద్వారా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మరింత ఊపందుకుంటాయని ఓ మంచివార్తను ప్రజెంట్ చేశారు. కానీ.. దేశ రాజధానిగా హైదరాబాద్ ఎప్పుడైంది అనేదే అంతుపట్టడం లేదు.
కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ ను రెండో రాజధానిగా ఎప్పుడు ప్రకటించింది? రాష్ట్రపతి ఏమైనా రాత్రికిరాత్రే ఉత్తర్వులిచ్చారా? లేదా పార్లమెంట్ తలుపులు మూసి రహస్యంగా ఏమైనా పని కానిచ్చేశారా? ఎందుకంటే అప్పట్లో తెలంగాణను పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు కదా.. అదే పద్ధతిలో ఇప్పుడు బీజేపీ నేతలు అవే ఎత్తుగడలేమైనా వేశారా? సామాన్య పాఠకుడికి ఇలా పరిపరివిధాలా ఆలోచనలు రావడం సహజం. కానీ కాస్త లోతుగా, సావధానంగా ఆలోచిస్తే లోగుట్టు ఏంటో అంచనా వేయొచ్చు.
ఆ పత్రిక 'ఆంధ్ర'ప్రభ అనేది మొదటి విషయం. తెలంగాణ ఏర్పాటును 'ఆంధ్ర' నాయకులు, కొన్ని వర్గాల ప్రజలు, ఆఖరుకు పాత్రికేయులు కూడా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని తెలిసినా కూడా తెలంగాణను అడ్డుకోవడానికి అనేక విఫల ప్రయత్నాలు చేశారు. రాతలు, కూతలు, ప్రజెంటేషన్లు అదే పద్ధతిలో జరిగాయి. అందులో కొందరికి ఇప్పటికీ హైదరాబాద్ అన్నా, తెలంగాణ అన్నా జీర్ణం కాలేకపోతున్న ఘనపదార్థమే. ఈ తరహా వ్యవహార శైలి చాలాసార్లు వారిలో కనిపించింది. ఇటీవల వరదల సమయంలో కూడా వారి ప్రజెంటేషన్లు అదే పద్ధతిలో జరగడం గమనించాలి. మొన్నటి భారీ వర్షం హైదరాబాద్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన మాట వాస్తవం. అదే సమయంలో ఏపీలో కూడా భారీగానే వర్షాలు పడ్డాయి. అక్కడా ముంపు భారీగానే జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఆంధ్రా వరదలకు లేని ప్రాధాన్యం హైదరాబాద్ కే ఇచ్చారు. అవకాశం దొరికింది కదాని తెలంగాణ సర్కారును ఏకిపారేశారు. అయితే ఏకిపారేయడంలో తప్పేమీ లేదు కానీ.. మోతాదుకు మించి అధిక ప్రాధాన్యతనివ్వడం అనేది వార్తారచనలో, ప్రజెంటేషన్లో నిజాయితీ కన్నా ఓ రకమైన ఓర్వలేనితనమే కనిపించింది. సరిగ్గా అలాంటి ఓర్వలేనితనమేదో దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చూడాలని తహతహలాడుతోందన్నమాట. అంతకన్నా వేరే కారణం ఏమీ కనిపించడం లేదు.
అయితే రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేయాలన్న ప్రతిపాదనలు కేంద్రం దగ్గర ఉన్నాయని చాలా కాలంగా వార్తలొస్తున్నమాట వాస్తవం. ఆ వార్తలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ మధ్య ఖండించడాన్ని గుర్తుంచుకోవాలి. అయితే భవిష్యత్తులో రెండో రాజధాని అనే ఆ కాస్త ముచ్చట కూడా తీరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పుడు అన్నిరంగాలనూ ఓవరాలింగ్ చేస్తోంది. ఆ ఓవరాలింగ్ లో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేసిపారేయొచ్చు కూడా. కానీ రెండో రాజధాని కాకముందే అయ్యిందన్న ముచ్చట తీర్చుకోవడం ఎందుకు? హైదరాబాద్ మీద అక్కసు వెళ్లగక్కడం ఎందుకు? ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే భద్రంగా మనసులో ఉంచుకుంటే అందరికీ మంచిది కదా.
Comments
Post a Comment
Your Comments Please: