Skip to main content

పీవీని స్మరించుకున్న తెలంగాణ జనత


 


భారతదేశానికి ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఓ మారుమూల గ్రామంలో పుడతాడని, అందులోనూ భారత ప్రధాని వంటి అత్యున్నత పదవికి పోటీపడే ఉత్తరభారతంలోని ఉన్నతమైన కుటుంబాల రాజకీయ పోటీని తట్టుకొని.. దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని కాబోయే వ్యక్తి పుడతాడని ఎవరైనా ఊహించగలరా? కానీ పాములపర్తి వేంకట నరసింహారావు అలియాస్ పీవీ నరసింహారావు విషయంలో అది నిజమైంది. ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే పీవీ రాజనీతి దేశంలోనే కాదు.. ఖండాంతరాలు కూడా వ్యాపించింది. ఎందుకంటే.. ఆయనకు అంత ఖ్యాతి వ్యక్తిగతమైన స్వచ్ఛత, సౌశీల్యతల వల్ల వచ్చింది కాదు. దేశ ప్రజలు మెచ్చిన పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చింది.


రాజకీయ చాణిక్యుడు... భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు. ప్రాంతం ముఖ్యం కాదు.. దేశమే ముఖ్యం అనే సిద్ధాంతంతో పాలన సాగించిన రాజనీతికోవిదుడు.. తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్ది పట్టాలెక్కించిన ప్రధాని ఆయన. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలపాటు విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించిన ప్రధాని కూడా ఆయనే. 


వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న రుక్మాబాయి,  సీతారామారావు  దంపతులకు పీవీ జన్మించారు. వరంగల్లు జిల్లాలోనే ప్రాథమిక విద్య మొదలుపెట్టారు. తరువాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు పీవీని దత్తత తీసుకోవడంతో అప్పటి నుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యారు. 1938లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి నిజాం ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ వందేమాతరం గేయాన్ని పాడాతు. దీంతో తాను చదువుకుంటున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి అతణ్ని బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి నాగపూరులో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు LLB చదివారు. పీవీ నరసింహారావు రాజకీయ ప్రస్థానంలో 1957లో మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగుసార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.  1962లో మొదటిసారి మంత్రి అయ్యారు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రిగాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రిగా, 1967లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించారు. కుల ప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీవీ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.


పీవీ నరసింహారావుది హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే వ్యక్తిత్వం. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన అతడికి కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్ని వరించింది. అయితే అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది అంటారు విశ్లేషకులు. 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణ ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమైంది. తెలంగాణ ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించినవారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని అతని వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని రాజకీయ నేపథ్యం కారణంగా.. పీవీ 1971 సెప్టెంబరు 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ముఖ్యమంత్రి బాధ్యతల నిర్వహణలో పీవీకి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోనే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలు అమలు పరచేందుకు చర్యలు తీసుకున్నారు పీవీ. ఇందువల్ల భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. పట్టణ భూగరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికల్లో 70 శాతం టికెట్లు వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానిస్తారు. అప్పటి రాష్ట్ర రాజకీయాలు హైదరాబాద్ కంటే ఢిల్లీ కేంద్రంగానే జరిగేవి అనేందుకు అదే ఓ నిదర్శనం. ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన కోస్తా, రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం చేపట్టారు. పీవీని తెలంగాణ నాయకుల పక్షపాతిగా... సీమాంధ్ర నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన మరో రకంగా ఉంది. వాస్తవానికి సీమాంధ్ర పెత్తందారీ పోకడలకు భయపడటం తప్ప ఢిల్లీ హైకమాండ్ కు సొంత బుర్రంటూ లేదని చెప్పుకోవాిలి. తెలంగాణ విభజన సమయంలోనూ ఇదే కనిపిస్తుంది. ఫలితంగా.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు అతను కొనసాగినా.. అధిష్టానం రాష్ట్ర రాజకీయాల్లో పీవీని పూర్తిగా పక్కన పెట్టేసింది. మౌనముద్రలో గంభీరంగా కనిపించే పీవీ ఆంతర్యం తెలుసుకోవడం అంత సులభం కాదని సీనియర్లంతా చెప్పుకుంటారు. పీవీకి ఎంత ఆగ్రహం కలిగినా దాన్ని దాచేవారని ప్రముఖ పాత్రికేయుడు ఇన్నయ్య ఓ సందర్భంలో పీవీ గురించి రాశారు. శాసనసభలో గానీ, లోక్ సభలో బాగా ఉపన్యాసానికి ముందు బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవారు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు.


పీవీ రాజనీతి కోవిదుడే కాదు. సాహిత్యంలో ఆయనది అందె వేసిన చేయి. అంతేకాదు.. ప్రపంచంలోని అనేక భాషల మీద ఆయనకు మక్కువ ఎక్కువ. ఆ భాషాభిమానమే ఆయన చేత అనేక భాషలు నేర్చుకునేలా చేసింది. భారత్ లోని 17 భాషల దాకా వ్యాకరణ సహితంగా వచ్చని చెబుతారు. ఆయన పుట్టి, పెరిగిన గ్రామాల నుంచి సన్నిహితులను కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా ఆదరించేవారని ఇప్పటికీ వారు గుర్తు చేసుకోవడం విశేషం.


రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా, పీవీ తనకిష్టమైన సాహితీ వ్యాసంగాలు వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవారు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవారు. పీవీ సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందింది ఇన్‌సైడర్ అనే ఆత్మకథ. లోపలిమనిషిగా ఇది తెలుగులోకి అనువాదమైంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, రజాకార్ల సమయాన్ని, దొరల దాష్టీకాన్ని, అదే సమయంలో దేశంలోని స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఒక నవలారూపంలో కాల్పనికతను జోడించి పీవీ ఎంతో నిగూఢంగా పుస్తకరూపంలో కూర్చారు. ఆ పుస్తకం సాహితీ లోకంలో చాలా పాపులర్ అయింది. ఇందులోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ అతను జీవితఘట్టాలకు చాలా దగ్గరి పోలిక ఉంది. నవలలోని కథానాయకుడి పాత్ర ఆనంద్... పీవీ నరసింహారావే అని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలు, నిజపాత్రలు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు పేర్లు మార్చినట్లు విమర్శకులు చెబుతారు. పీవీ సాహిత్యంలో మరో కలికితురాయి సహస్రఫణ్. విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు పుస్తకానికి హిందీ అనువాదమే సహస్ర ఫణ్. ఈ పుస్తకానికే పీవీకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అలాగే మరాఠీ సాహిత్యాన్ని కూడా తెలుగులోకి అనువదించారు. నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు.. దాదాపు 17 భాషలు వచ్చునని చెబుతారు. అందులో వ్యాకరణ సహితంగా 14 భాషలు తెలుసంటారు. కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషీను భాషల్లో కూడా పీవీకి ప్రవేశం ఉంది.


ఇక పీవీ శతజయంతి ఏర్పాట్లను ఈసారి తెలంగాణ సర్కారు ఏడాదిపాటు అధికారికంగా ఘనంగా నిర్వహిస్తోంది. సాహితీ సమావేశాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు.. ఇలా భాషాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం పది కోట్ల రూపాయల ఫండ్ ను విడుదల చేశారు. పీవీ పేరిట మ్యూజియం కూడా పెడతామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. శతజయంతిని పీవీ స్వగ్రామంలో అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. 


పీవీ తన వంగర గ్రామం కంటే దేశానికే గొప్ప సేవ చేశారని, ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చిన గొప్ప వ్యక్తి అని గ్రామ సర్పంచ్ అంటున్నారు. గ్రామంలో ఉన్న పేద ప్రజలకు తన సొంత భూమిని దానంగా ఇచ్చారని, అలాగే వంగరను అభివృద్ధి పథంలో నడిపించారని గ్రామస్తులు పీవీని గుర్తు చేసుకుంటున్నారు. వంగర గ్రామవాసిగా పీవీకి జాతీయ గుర్తింపు రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. కరీంనగర్ జిల్లాకు గానీ, వరంగల్ జిల్లాకు గానీ పీవీ పేరు పెట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


దేశానికి ఘనమైన ఖ్యాతిని తీసుకొచ్చిన పీవీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం స్వాగతించాల్సిన అంశంగా ప్రజలు భావిస్తున్నారు.


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత