Skip to main content

వార్త రాస్తే ఇల్లు కూల్చాలా?


 


ఓ గ్రామీణ విలేకరి ఇల్లు కూలింది. పెను దుమారానికో, విపరీతమైన వర్షానికో, లేక  శిథిలావస్తకు చేరుకునో ఆ ఇల్లు కూలలేదు. ఇంకా ఆకృతి  దాల్చని ఆడశిశువు పీక పిసికేసినట్టు ఇప్పుడే పునాదులు పూర్తి  చేసుకొని గోడల దశకు చేరుకున్న ఇల్లు నేలమట్టమైంది. పిల్లాడు ఐస్ క్రీమ్ చీకినంత ఈజీగా ఒక ఎమ్మెల్యే పంపిన మనిషి బుల్డోజర్ మీద వచ్చి ఆ విలేకరి ఇంటిని పునాదులకంటా నేలకు నాకించేశాడు. వార్త రాసి, అది కాస్త డెస్క్ లో ఊపిరి పోసుకొని శాటిలైట్ గుండా ప్రపంచాన్ని పలకరించేసరికి విలేకరికి చాలా సంతృప్తే కలిగి ఉండొచ్చు. ఎందుకంటే.. ఆ వార్త ఏ గల్లీ లీడర్ మీదనో రాసింది కాదు కాబట్టి. ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన ఓ బర్త్ డే పార్టీలో కోవిడ్ నిబంధనలు గాలికొదిలేశారని, దాదాపు 200 మందికి పైగానే పార్టీకి హాజరై.. ఎవరూ మాస్కులు ధరించలేదని, సోషల్ డిస్టెన్స్ పాటించలేదని, ఓ నాయకుడే ఇలా కోవిడ్ రూల్స్ కి పాతరేస్తే మరి రూల్స్ ఎందుకు? నాలుక గీసుకోవడానికా ? అన్న నికార్సిన ఆవేదనతో పరమేశ్ అనే వీ6 విలేకరి ఓ వార్తను ఫైల్ చేశాడు. ఆ వార్త కాస్తా ప్లే అయింది. ఎమ్మెల్యే ఇంటికి 200 మంది బంధుమిత్రులు, వెంట ఉండే అనుచరగణం హాజరైనా పోని పరువు కాస్తా విలేకరి పంపిన ఒక నిమిషం వీడియో క్లిప్ కాస్తా ఎమ్మెల్యే పరువుతో ఆటాడుకుంది. నియోజకవర్గంలో తాను ఎదురెళ్లడమే  తప్ప.. తనకెవరూ ఎదురు రారన్న ధీమాతో ఉన్న భూపాల్ రెడ్డికి ఆఫ్టరాల్ ఒక విలేకరి ఎదురు రావడం జీర్ణించుకోలేకపోయాడు. ఏముంది విలేకరి దగ్గర?  ఓ కెమెరా కన్ను, ఇంకో పెన్ను. తనగురించి ఏం రాయకూడదో ఆ పెన్ను రాసేసింది. తన గురించి ఏం చూపించకూడదో కెమెరా చూపించింది. ఇంక దాచుకోవడానికి ఏముంది?  విశ్వరూపం ప్రదర్శిస్తే పోయేదేముంది? ఊరుకుంటే రేపు ఇంకెవరో కుర్ర విలేకరికి కూడా కొమ్ములొస్తే ఎలా? ఒక్కడి దగ్గరే ఫుల్ స్టాప్ పెడితే బెటర్ కదా. ఇంకెవరైనా తన గురించి ఆలోచించే చాన్స్ ఇవ్వకూడదు. తన గురించి ఆలోచిస్తేనే పెన్నులో ఇంకు కారిపోవాలి. కెమెరా కన్ను మూతపడిపోవాలి. ఈ సమస్య తనొక్కడిదే కాదు కదా. తనలాంటి మరో 118 మంది ఎమ్మెల్యేలు, 38 మంది ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా వేలాది మందికి ఇలాంటి సమస్య ఇకపై ఎదురు కాకూడదు అనుకున్నాడో ఏమో. పరమేశ్వర్ కట్టుకుంటున్న ఇంటిని బుల్డోజర్ తో నాకించేశాడు. అచ్చంగా ఐస్ క్రీమ్ లాగా. 


భూపాల్ రెడ్డికి అంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది?


వెరీ సింపుల్. పాత్రికేయులు, జర్నలిస్టుల పరిస్థితి కేసీఆర్ పవర్లోకి వచ్చాక కమెడియన్లకన్నా అధ్వానంగా తయారైంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ప్రెస్ మీట్ కు పిలిచినా నాలుగు అక్షింతలు వేయించుకొని రావడం, లైవ్ లో కేసీఆర్ ఇచ్చే క్లాసులు ప్రజలకు నేరుగా చేరిపోవడం, విలేకరుల పరువు కాస్తా పలుచనైపోవడం, విలేకరులు అడిగేవి చొప్పదంటు ప్రశ్నలుగా వినేవారికి  అనిపించడం, విలేకరులంటే తామేదో సీఎంను ఇరుకున పెడతారనుకుంటే వీరేంటి? ఉల్టా క్లాస్ పీకించుకొని వస్తున్నారని ప్రజలు అనుకోవడం.. ఇలాంటి సీన్లు తెలంగాణ వచ్చినప్పటి నుంచే విశ్లేషకులకు కనువిందు చేస్తున్నాయి. అధినాయకుడు ఇస్తున్న ట్రీట్ మెంటే వందిమాగధులకు కొండంత బలాన్నిస్తుందని జనమంతా అనుకుంటున్నారు. ఇక జర్నలిస్టు సంఘాలెన్ని ఉన్నా.. ప్రధానంగా రెండు వర్గాలుగా చీలిపోయారు. లబ్ధి పొందిన జర్నలిస్టులు. లబ్ధి పొందని జర్నలిస్టులు. మొదటివారు బాస్ దగ్గరే ఉంటున్నారు. రెండోవారు ప్రెస్ గ్యాలరీలో పెద్దసార్ చెప్పేది రాసుకుంటున్నారు. వందిమాగధులు కూడా చిన్నపాటి బాసులే కదా. కాబట్టి అదే బాటలో వీరు కూడా పయనిస్తున్నారు. భూపాల్ రెడ్డిది కూడా అదే ధైర్యం. ఇప్పటికే పెద్దసైజు మీడియా కంపెనీల నోర్లు కూడా ఒక్కొక్కటిగా మూయిస్తూ వస్తున్న క్రమంలో ఆఫ్టరాల్ ఓ చిన్న పల్లెటూరి విలేకరి పిల్లగాడు గులాబీ బాస్ అనుచరుడిని ప్రశ్నిస్తే రియాక్షన్ ఇలా కాక ఎలా ఉంటుంది? 



మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? 


ఏ విషయమైనా చాటుగా డీల్ చేస్తే మర్యాద కాపాడుకున్నట్టు ఉంటది. కానీ నారాయణ్ ఖేడ్ సబ్జెక్టు పబ్లిక్ ఇష్యూ అయిపోయింది కదా. అయినా సరే ప్రభుత్వం మాత్రం భూపాల్ రెడ్డిని క్షమాపణ కోరుమని ససేమిరా అడిగే చాన్స్ అయితే కనిపించడం లేదు. ఆయన సారీ చెప్పినా ప్రభుత్వం సారీ చెప్పినట్టే కదా. ఆయన పరిహారం చెల్లించుకున్నా ప్రభుత్వం చెల్లించుకున్నట్టే  కదా. ఇలా చెల్లించుకుంటూ  పోతే ఎంతమందికి చెల్లించాలి? ఎంతమంది ప్రజాప్రతినిధుల చేత సారీ చెప్పించాలి? భూపాల్ రెడ్డికి ముందు పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన, చొక్కా పట్టుకొని లాగిన దోస్త్ పార్టీ ఉంది కదా. ఆ పార్టీ కౌన్సిలరే పోలీసును బండబూతులు తిట్టాడు. జీవితం మీద విరక్తి  పుట్టేలా వ్యవహరించాడు. అయినా అధికార పార్టీ ఏమీ అనలేదు కదా. పోలీసులంటే ప్రభుత్వ రక్షకులు. అధికార పార్టీకి అంగరక్షకులు. ఆ అంగరక్షకుల్లో ఒకరికి (కుల్సుంపురా పోలీస్ కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి) కోవిడ్ సోకినా గుర్తించలేని, ట్రీట్ మెంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆఫ్టరాల్ విలేకరి సంగతిని ఎవరడిగారు? హృదయాలు గాయపడ్డ విలేకరులు పోరాడతామంటున్నారు. పేదోడి పోరాటం ఎన్నిరోజులుంటది? మళ్లీ అవతలి పార్టీనో, ఇవతలి పార్టీనో ఎవరో ఒకరి మద్దతు కావాలి. అదేదో వారికెందుకు అవకాశం ఇవ్వాలి? మనసులు గాయపడ్డ విలేకరులకు మనమే మలాం రాద్దాం లేదా రాసినట్టు చేద్దాం అన్న ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ కావచ్చు. మొత్తానికి ఇదో పెద్ద ఇష్యూ మాత్రం కాదనేది గట్టి అభిప్రాయం. 



అయితే దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. విలేకరులకు జరుగుతున్న అవమానాలకు, ఆకలికేకలకు కూడా ఒక చివరి రోజంటూ వస్తుంది. ఎన్నడూ లేంది.. ప్రభుత్వ వర్గాల్లో, వైద్య విభాగంలో, పోలీసు శాఖలో సైతం... అధినాయకత్వం ఒంటెత్తుపోకడల మీద బహిరంగ కామెంట్లు వినిపిస్తున్న విషయాన్ని సర్కారువారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా దిద్దుబాటు చర్యలు తీసుకునే వీలుంటుంది. అది ఆలస్యం కాకుండా చూసుకుంటే మరీ మంచిది. 



Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత