Skip to main content

"జమిలి".. ప్రజాస్వామ్య ప్రస్థానానికి ఓ మజిలీ

జమిలి ఎన్నికల దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. మరి దేశమంతా అన్ని రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ కు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మనకు ఎంతవరకు శ్రేయస్కరం? కేవలం ఖర్చు తగ్గించుకోవడం కోసమే జమిలికి వెళ్లాలా? లేక పరిపాలనా సౌలభ్యం అంతకంటే ముఖ్యమా? మొన్ననే ఎన్నికలు జరుపుకున్న తెలంగాణ గానీ, ఆంధ్రా గానీ.. పూర్తి కాలం ముగియకుండానే మరోసారి ఎన్నికలు ఎదుర్కోవాల్సి రావడం వల్ల కలిసొచ్చేది ఎవరికి? కష్టకాలం దాపురించేది ఎవరికి? ఇలా అన్ని వర్గాల దేశ ప్రజల్ని ప్రభావితం చేస్తున్న జమిలితో మిగిలేదేమిటి?
మోదీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవభారత ఎజెండాకు రూపమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  మోదీ 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లబోతున్నారన్న సంకేతాలు  బలంగా వినిపిస్తున్నాయి.  లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది నవభారత ఎజెండాలో తొలి ప్రాధాన్య అంశం. దీన్ని  దృష్టిలో పెట్టుకుని దేశంలోని అన్ని వర్గాల ప్రజల మనసులూ గెలుచుకునేందుకు మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. అంతేకాకుండా ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే ప్రబల ఆర్థికశక్తిగా మార్చాలని మోదీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. 
 


దేశాన్ని ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారుస్తామని మోదీ సర్కార్ లక్ష్యంగా  పెట్టుకుంది. ఈ లక్ష్యం సాధించడం ఆశామాషీ వ్యవహారం కాదు. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎదురవుతున్న సవాళ్లు కూడా  తక్కువేమీ కాదు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థికవ్యవస్థగా మారాలంటే కేవలం ఐదేళ్లలో 8 శాతం వృద్ధిరేటు సాధించాలి. ఇది మోదీకి తలకు మించిన భారాన్ని  నెత్తికెత్తుకున్నట్లే. ఇప్పటికే వ్యవసాయ రంగ సబ్సిడీల రూపేణా భారీగా ఖర్చు పెరగడంతో  పన్ను వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్‌పై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలతో  చమురు ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  జీఎస్టీ వసూళ్లు తగ్గే అవకాశం ఉండటంతో  ఆయుష్మాన్‌ భారత్‌, పీఎం కిసాన్‌ లాంటి పథకాలకు నిధులు సమకూర్చడం భారీ సవాలుగా మారనుంది. ద్రవ్య క్రమశిక్షణ లేకపోవడంతో సమస్యలు ఉత్పన్న మవుతాయని దీంతో ముందుగా ద్రవ్య క్రమశిక్షణపై  దృష్టి సారించాలని ఇటీవలి ఆర్థిక సర్వే కీలక సూచన చేసింది.


అటు కేంద్రంలోనూ   ఇటు అన్ని రాష్ట్రాల్లోనూ   ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల వృధా ఖర్చు, పరిపాలనలో కాఠిన్యతను, ఇతరత్రా సమస్యలను అధిగమించవచ్చని నీతి ఆయోగ్ కేంద్రానికి నివేదిక సమర్పించింది. ఇదే అంశంపై గతంలో పార్లమెంటరీ స్థాయీసంఘం, కేంద్ర ఎన్నికల సంఘం, ఇతర సంస్థలు, మేధావులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ క్రోడీకరించిన నీతి ఆయోగ్ దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై నివేదిక సమర్పించింది. 2022లో లోక్ సభతో పాటు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐదేళ్ల కాలం పూర్తి కాని వాటిని కొన్ని నెలలకు కుదించడం, పూర్తయిన వాటికి మరికొంతకాలం పొడిగించడం ద్వారా జమిలి ఎన్నికలను ఒకేసారి నిర్వహించవచ్చని నీతి ఆయోగ్ సూచించింది. 


లోక్‌సభకు, రాష్ట్రాల శాసనసభలకు  ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదనను పలు  రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఆచరణ సాధ్యం కాదని విమర్శలు చేస్తున్నాయి. జమిలిపై ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. దీనిపై చర్చించేందుకు హాజరైన ప్రాంతీయ పార్టీలు కొన్ని వ్యతిరేకించగా కొన్ని సానుకూలంగా స్పందించాయి.  జమిలి ఎన్నికలకు  డీఎంకే, అన్నాడీఎంకే, అకాలీదళ్‌ సమర్ధించగా జమిలి ప్రతిపాదనను తెలుగుదేశం వ్యతిరేకిస్తోంది. ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చడానికి బీజేపీ పన్నిన ఎత్తుగడగా దీన్ని అభివర్ణిస్తోంది. జమిలి ప్రతిపాదనతో విపక్షాల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. మరోవైపు బీజేపీకి మిత్ర పక్షాలుగా వ్యవహరిస్తున్న ఏపీలోని అధికార వైసీపీ, తెలంగాణలోని  టీఆర్‌ఎస్‌లు మాత్రం సానుకూలంగా స్పందించాయి. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  జమిలి ఎన్నికలపై  లా కమిషన్‌ చేస్తున్న సంప్రదింపులను సీపీఐ, సీపీఎం తప్పుబట్టాయి. రాజ్యాంగ సవరణలతో కూడుకున్న జమిలి ఎన్నికల అంశం లా కమిషన్‌ అధికార పరిధిలోకి రాదని, ఇది పార్లమెంటు పరిధిలోనిదని సీపీఐ కార్యదర్శి అతుల్‌ రంజన్‌ విమర్శిస్తున్నారు.


అయితే జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పార్టీలలో గోవాలో బీజేపీ మిత్రపక్షం  గోవా ఫార్వర్డ్‌ పార్టీ కూడా చేరింది. జమిలి ప్రతిపాదన సమాఖ్య స్పూర్తికి సంబంధించిన అంశమని, ప్రాంతీయ భావోద్వేగాలకు వ్యతిరేకమని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు గోవా ఫార్వర్డ్‌ పార్టీ అధ్యక్షుడు, గోవా మంత్రి విజయ్‌ సర్దేశాయ్‌ స్పష్టం చేశారు. జమిలి విధానాన్ని అమలు చేస్తే ప్రాంతీయ సమస్యలు, అంశాలు వెనక్కి నెట్టివేస్తారని  తృణమూల్‌ నేత ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఏ పార్టీకీ మెజారిటీ రాని సందర్భంలో  సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా మద్దతు ఉపసంహరించుకుంటే లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా...? అని త్రుణమూల్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తు పోకడలకు జమిలి ఎన్నికలు నిదర్శనమంటూ త్రుణమూల్ ఆరోపిస్తోంది.   రాజ్యాంగంలో ఎక్కడా జమిలి ఎన్నికలపై చర్చించలేదని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. అసోంకు చెందిన ఆలిండియా డెమొక్రటిక్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ కూడా దీన్ని వ్యతిరేకించింది. ఎన్నికల సంస్కరణలు జరగాలి తప్ప జమిలి ఎన్నికలు కాదని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌... లా కమిషన్‌కు సూచించింది. అయితే జమిలి ఎన్నికలపై విపక్షాలలో ఐక్యత కొరవడటంతో బీజేపీని మిత్ర పక్షాలు సమర్థిస్తుండగా... వ్యతిరేక పక్షాలు నిరసన గళం వినిపిస్తున్నాయి. 


జమిలితో ప్రాంతీయ పార్టీల  భవిష్యత్తేంటి?


జమిలి ఎన్నికలపై తీవ్ర కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో దక్షిణాదిలో పాగా వేయడానికి కమలనాథులు వ్యూహ రచన చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణల్లో అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. చాపకింద నీరులా కేడర్ ను విస్తరిస్తోంది. 2022లోనే జమిలి ఎన్నికలంటూ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. ఇటీవలే ఎన్నికలు జరిగిన తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. సాధ్యమైనంత మేరకు పార్టీలోకి విపక్షాల నుంచి వలసలను ప్రోత్సహిస్తో్ంది. ఏపీలో టీడీపీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు పలువురు సీనియర్ నేతలు రెడీగా ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.  మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ తో పాటు అధికార టీఆర్ఎస్ నుంచి మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలు టీఆర్ ఎస్ సర్కార్ జీవితకాలం 33 నెలలేనంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రాంతీయ పార్టీల అభిప్రాయాలు ఎలా ఉన్నా మోదీ సర్కారు మాత్రం జమిలి ఎన్నికలకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ ఎస్ సర్కార్ డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సార్వత్రిక ఎన్నికలు, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికల పేరుతో రాష్ట్రంలో ఎన్నికలకోడ్ అమల్లో ఉండటంతో ఆరేడు నెలలపాటు  ప్రభుత్వ పాలన కుంటుపడింది. సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మరో మూడున్నరేళ్లలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో తొలిసారి అధికారం దక్కించుకున్న జగన్  ప్రభుత్వం కూడా జమిలి ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మూడున్నరేళ్లకే ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తుంది. 


 


తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం బీజేపీ పటిష్ఠ వ్యూహం అమలు చేస్తోంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ అధినాయకత్వం..  పలు వర్గాల వారికి చేరువయ్యేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా డాక్టర్లు, ఇంజనీర్లతో పాటు ఐటీ రంగ నిపుణులతో వరుస భేటీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసింది. పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. తద్వారా పార్టీ కేడర్‌ను  పటిష్ఠం చేయాలని భావిస్తోంది. పార్టీ నేతల భేటీలలో జాతీయవాదానికి విస్తృత ప్రచారం కల్పించనుంది. తొలి దశలో వృత్తి నిపుణులు, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించనుంది.  అనంతరం కులసంఘాల పెద్దల వద్దకు పార్టీ స్థానిక నాయకత్వం వెళ్లనుంది. 


 


దేశ ప్రజలందరికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు మోదీ ప్రభుత్వం తీవ్ర కసరత్తే చేస్తోంది. ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ ను తీర్చిదిద్దారు. ఇపుడు ఒకే దేశం ఒకే రేషన్ పేరుతో భారీ సంస్కరణలకు తెరలేపారు. పలు వినూత్న పథకాలతో దేశ ప్రజల్లో చెరగని ముద్ర వేసేందుకు మోదీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లలో కేంద్రంలో బలమైన ప్రభుత్వం లేకపోవడంతో దేశాభివ్రుద్ధి కుంటుపడినట్లు కేంద్రంలోని బీజేపీ భావిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వాలతో దేశానికి ఒరిగేదేమీ లేదని జాతీయ పార్టీలతోనే అభివ్రుద్ధి సాధ్యమని బీజేపీ ధ్రుడంగా విశ్వసిస్తోంది. కేంద్రంలో పూర్తి మెజారిటీ రావడంతో బీజేపీ ప్రభుత్వం భారీ సంస్కరణలు చేపట్టేందుకు సమాయత్తమవుతోంది. విపక్షాలు ఒప్పుకున్నా లేకున్నా జమిలి ఎన్నికలు నిర్వహించేందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో మోదీ ప్రభుత్వానికి ఎదురు చెప్పి నిలబడే ధైర్యం ఏ ప్రాంతీయ పార్టీ చేయదని గతానుభవాలను బట్టి చూస్తే అర్థమవుతోంది. మరి... బీజేపీ నేతలు చెబుతున్నట్టు తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు.. 33 నెలలే ఉంటుందా? ఆ తరువాత జమిలి ఎన్నికలు తప్పవా? తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు.. అటు ఏపీలో కూడా ఎన్నికలు జరగాల్సిందే కదా. అలాంటప్పుడు వైసీపీ నేతలు కేంద్రం ఎత్తుగడను ఎలా జీర్ణించుకుంటారు...?  ఇలా జమిలి ద్వారా అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపవచ్చని మోడీ సర్కారు ఆలోచిస్తున్న క్రమంలో జమిలి ఎన్నికల కథ ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనన్న అభిప్రాయాలైతే వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. 


 


Comments

Popular posts from this blog

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

"రామప్ప గుడి యాత్ర"కు అనూహ్య స్పందన

తాము తలపెట్టిన రామప్ప గుడి యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని, ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణ నుంచే కాక, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరిన్ని  యాత్రలు  నిర్వహిస్తామని మంగళంపల్లి మహామాయి దేవాలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధి బొడ్డుపల్లి  బాలబ్రహ్మాచారి పేర్కొన్నారు.  ప్రపంచ దేశాల్లో భారతీయ శిల్పకళకు, శిల్పాచార్యుల   ప్రతిభా పాటవాలకు అజరామరమైన కీర్తిని సంపాదించిన  రామప్ప దేవాలయ   చరిత్రను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జనవరి ఒకటో తేదీన తాము ఈ   యాత్రను తలపెట్టామని, అయితే ఈ యాత్రకు తాము అనుకున్నదానికన్నా ప్రజల నుంచి ఎక్కువ స్పందన వచ్చిందని, ఆ ఉత్సాహంతో మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేసి ఎక్కువ మంది ప్రజలను భాగస్వామ్యం చేస్తామని, మరిన్ని యాత్రలు చేపడతామని చెప్పారు.  రామప్ప అనే శిల్పాచార్యుడి పేరుతో శతాబ్దాలుగా ప్రజలందరికీ సుపరిచతమైన అద్భుతమైన  ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన తరువాత రామప్ప అనే పేరును క్రమంగా  అదృశ్యం చేసే కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే యునెస్కో ధ్రువీకరించిన శాసనంలో రామప్ప గుడి అనే పేరును బ్రాకెట్లో పెట్టి రుద్రేశ్వరాలయాన్ని ప్రధానంగా తెరమీదికి ఎక

'తానా' కవి సమ్మేళనానికి ఎంపికైన జె.వి.కుమార్ చేపూరి

తానా ప్రపంచ సాహిత్య వేదిక "భారతదేశ వజ్రోత్సవాలు"  పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై ప్రతిష్టాత్మకంగా "అంతర్జాతీయ కవితల పోటీలు" నిర్వహించింది. ఈ పోటీలో హైదరాబాద్ కు చెందిన కవి, రచయిత జె.వి. కుమార్ చేపూరి ఎంపికయ్యారు. ఈ నెల 24న (2022 ఏప్రిల్ 24) తానా ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్న “కవితాలహరి”లో జెవి కుమార్ చేపూరి తన కవితను ఆవిష్కరించబోతున్నారు. “భారతదేశ సమగ్రత”  అనే ఇతివృత్తంపై జెవి కుమార్ ఇదివరకే సమర్పించిన "సర్వమత సారం - మానవత్వం" అనే వచన కవిత ఈ పోటీకి ఎంపికైంది.  Also Read:  కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్ ఎప్పుడో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ వీడియో వేదికగా జరిగే ఈ కవితావిష్కరణ సభలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరికి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాసుకు, ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూరకు జె.వి.కుమార్ కృతజ్జలు తెలియజేశారు. అనేక మంది దేశ, విదేశ తెలుగు కవులు, సాహితీవేత్తలు హాజరయ్యే ఈ కవితాలహారి కార్యక్రమం తానా అధికారిక యూ-ట్యూబ్ ఛానెల్, ముఖపుస్తకం (ఫేస్ బుక్) ఛానల్ ల