Skip to main content

<అసదుద్దీన్ కి తమ్ముడే తలనొప్పి>

తమ్ముడంటే ఎలా ఉండాలి? రాముడికి లక్ష్మణుడిలా ఉండాలి. అన్న గౌరవాన్ని పెంచేలా తమ్ముడు నడుచుకోవాలి. కానీ.. అన్న నిర్మించుకుంటూ వస్తున్న గౌరవ-మర్యాదలను వెనుక నుంచి కూల్చేస్తూ రావడం... బాధ్యత గల తమ్ముడు చేయాల్సిన పనేనా? తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని.... సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్న బిల్డప్ చేస్తూ వస్తుంటే... తమ్ముడు చేసే దుందుడుకు వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయి? టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ లో అన్నదమ్ముల మధ్య పొసగని అభిప్రాయాలతో భారీ మూల్యం తప్పదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 
దశాబ్దాలుగా పాతబస్తీలో పాగావేసిన మజ్లిస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నట్లే కనిపిస్తోంది.  హైదరాబాద్ లో ఒవైసీ సోదరుల గురించి పరిచయం అక్కర్లేదు. తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ హయాంలో ఎంఐఎం ఓ వెలుగు వెలిగింది. ఆయన అనంతరం పార్టీని నడిపిస్తున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్  ఒవైసీల ఆధ్వర్యంలో కూడా పార్టీ దూసుకుపోతోంది. అందులో నో డౌట్. అయితే సహోదరుల మధ్య వ్యవహారాల్లో మాత్రం కొన్ని భిన్న వైఖరులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  అన్న అడుగుజాడల్లో అక్బర్ నడుస్తున్నట్లే కనిపిస్తున్నా... అక్బర్ అనాలోచిత ఆవేశంతో అన్నకు కొత్త చిక్కులు తేవడం ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది. అన్నివర్గాలను కలుపుకు పోవాలని అసదుద్దీన్ ప్రయత్నిస్తుంటే... అక్బర్ మాత్రం అందుకు భిన్న ధ్రువంగా మారినట్టు కనపిస్తోంది. దళితులను, ముస్లింలను కలుపుపోయేందుకు అసదుద్దీన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడుని అడ్డుకునేందుకు ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే అక్బరుద్దీన్ అనాలోచిత నిర్ణయాలు, ఆవేశపూరిత ప్రసంగాలు బీజేపీకి అందిన అస్త్రాలుగా మారుతున్నాయి. బీజేపీ హవాను ఎలాగైనా  అడ్డుకోవాలని అసద్, కేసీఆర్ లు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... తన పరుష పదజాలంతో, టెంపర్ మెంట్ బాడీ లాంగ్వేజ్ తో అక్బరుద్దీన్ అనేక అనుమానాలు రాజేస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే.. రెండు ప్రధాన వర్గాల ప్రజల మధ్య సున్నితమైన స్నేహ సంబంధాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయన్న ఆందోళన తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదం రాకుండా ఉండేందుకు అన్న అసదుద్దీన్ చిత్తశుద్ధితో శ్రమిస్తుండగా.. అక్బరుద్దీన్ వైఖరితో అసద్ విసిగిపోతున్నట్లు సమాచారం. 


హిందూ-ముస్లింలు కావడి కుండలుగా కలిసి ఉండేందుకు, మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచే అసదుద్దీన్ కు కూడా కేసీఆర్ మీద గురి కుదిరిందని చెబుతారు. ఆ నమ్మకమే అసదుద్దీన్ చేత అనేక సందర్భాల్లో కేసీఆర్ కు ఆత్మీయ హస్తం అందించేలా చేసింది. వారి మధ్య ఏర్పడ్డ స్నేహ బంధం చేతనే.. ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ కు ఎంఐఎం బహిరంగ మద్దతు ప్రకటించడం విశేషం. అలాంటిది ఇప్పుడు తమ్ముడు అక్బర్ కారణంగా రెండు వర్గాల ప్రజల మధ్య అనుమానాలు మొదలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. తమ్ముడి మాటల్లో చట్ట వ్యతిరేక పదాలేవీ లేవని పోలీసు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ.. ఆయన చేసిన పాత కామెంట్లతో పాటు, కరీంనగర్ లో ఆయన ఆవేశపూరిత ప్రసంగం, ఆ సందర్భంగా అక్బర్ బాడీ లాంగ్వేజీ, ఆయన వెనుక కుర్రకారు కేరింతలు చూస్తే.. అందులో జరిగిన కమ్యూనికేషన్ ఏంటో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 


మతతత్వ పార్టీగా ముద్రపడిన మజ్లిస్ రానురాను తన పంథాను మార్చుకుంటూ తనపై ఉన్న ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధన, వారి సంక్షేమమే ప్రధాన ఎజెండా గా పార్లమెంటులో సైతం అసద్ వాణి వినిపిస్తున్నారు. వీరితో పాటు హిందువులకు కూడా తగు ప్రాతినిధ్యమిస్తూ 1986లో కాంగ్రెస్ మద్దతుతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలోకి వచ్చిన మజ్లిస్ ముగ్గురు హిందువులను ఒక్కొక్కరిని ఒక్కో ఏడాది మేయర్లుగా నియమించింది. 2009 ఎన్నికలలో రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం తన ఎమ్మెల్యే అభ్యర్థిగా హిందూ అభ్యర్థి మురళీధర్‌రెడ్డిని బరిలోకి దించింది. గత మూడు పర్యాయాలుగా హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఎంఐఎం పార్టీ నుంచి ఐదు నుంచి ఆరుగురు హిందువులు కార్పొరేటర్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ పార్టీ మద్దతుగా నిలిచింది.  


ఇప్పటివరకూ ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం తెలంగాణ అంతటా దాని ప్రాభవాన్ని విస్తరించేందుకు వ్యూహరచన చేస్తోంది. గ్రేటర్ పరిధిలో మాత్రం తన పట్టు సడలకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే అక్బరుద్దీన్ వైఖరితో గతంలో ఎంఐఎం మాత్రమే ఇరుకున పడేది. ఇపుడు టీఆర్ఎస్ తో దోస్తీ కారణంగా అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు గులాబీ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు ఎంఐఎం అనే మత తత్వ పార్టీకి కేసీఆర్ కొమ్ము కాస్తున్నారని, ముస్లింల ఓట్ల కోసం ఎంఐఎం ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా వారికి అండగా నిలుస్తూ అధికారాన్ని సైతం తాకట్టు పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారంటూ విమర్శల్లో పదును పెంచుతోంది. ఇలా రాజకీయ, సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న క్రమంలో... అక్బర్ ను దారికి తెచ్చుకోవడం అసద్ కు తప్పనిసరి వ్యవహారంగా మారింది. అయితే తమ్ముణ్ని సరిదిద్దుకోలేని పక్షంలో అసద్ నిర్మించుకుంటూ వస్తున్న ఫ్రెండ్లీ ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి అసద్.. తమ్ముణ్ని ఎలా దారికి తెస్తాడు? అటు దారికి తెచ్చుకోలేక ఆత్మీయ మిత్రుడైన కేసీఆర్ ను అసమర్థుడిగా ప్రజల ముందు నిలబెడతారా? ఆ విధంగా పరోక్షంగా బీజేపీ ప్రాభవానికి పట్టం కడతారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అసదుద్దన్ మస్తిష్కాన్ని తొలుస్తున్నట్లు అసదుద్దీన్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి అసదుద్దీన్ ఈ వ్యవహారాన్ని ఎలా సరిదిద్దుతారో చూడాలి. 


- టి.రమేశ్ బాబు


- rameshbabut@hotmail.com


 


Comments

Popular posts from this blog

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే