Skip to main content

పాలమూరుకు ప్రథమ ప్రాధాన్యతాంశంగా

తొమ్మిది నెలల ముందుగానే తెలంగాణ సర్కారును రద్దు చేయాలన్న నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారు? తప్పకుండా మళ్లీ గెలుస్తానన్న ధైర్యం ఆయనకు ఎలా వచ్చింది? తాను చేసిన ఏ పనులు మళ్లీ గెలిపిస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు? మళ్లీ గెలిస్తే ఏ పనులు చేపట్టే అవకాశాలున్నాయి? కుడిభుజం లాంటి వారి సహకారం లేకపోతే కేసీఆర్ అంత పెద్ద నిర్ణయం తీసుకునేవారేనా? కేసీఆర్ కు కుడిభుజం లాంటి వ్యక్తి అయిన ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి... టి.రమేశ్ బాబుకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు యథాతథంగా...


 

1 ప్రశ్న- వనపర్తిలో మీరు తొలిసారి ఓటమి చవి చూశారు. మిమ్మల్ని మరోసారి ఓడించడానికి ప్రత్యర్థులు ఒక్కటై మీ మీద పోటీకి దిగితే మీరెలా ఎదుర్కొంటారు?


 

వనపర్తి ప్రజలంతా నిరంజన్ రెడ్డి వైపు.. వాళ్లిద్దరూ (చిన్నారెడ్డి-కాంగ్రెస్, రావుల చంద్రశేఖర్ రెడ్డి-టీడీపీ) ఒకవైపు. ఆ మంత్రగాళ్ల మంత్రం పాటి తప్పింది. పాటి తప్పిన మంత్రం పని చేయదు. నేను చేసిన పనే నన్ను గెలిపిస్తుంది. అదే అన్నిటికీ సమాధానం చెప్తుంది.

 

[caption id="attachment_362" align="alignnone" width="964"]Rameshbabu with S.Niranjanreddy 2014లో ఓడించిన ప్రజలే 2018లో గెలిపిస్తారంటున్న ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. శాసనసభ రద్దు తరువాత రమేశ్ బాబుకు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూ.[/caption]


2 ప్రశ్న- పాలమూరు బిడ్డగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు, మీరు పోటీ చేస్తున్న వనపర్తి జిల్లాకు మీరు చేసిన పనులేంటి?

 

పాలమూరుకు ప్రథమ ప్రాధాన్యతాంశంగా సాగునీటి ప్రాజెక్టులకే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టాం. దాని ఫలితాలు కూడా వస్తున్నాయి. ప్రజలకు ఆ ఫలాలు అందుతున్నాయి. అవి కాకుండా వనపర్తి జిల్లాకు మెడికల్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీ, ఫిషరీస్ కాలేజీ సాధించుకున్నాను. ప్రభుత్వ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలు వస్తాయి.

 

ఇక కె.ఎల్.ఐ (కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్) ద్వారా పాలమూరు ప్రాజెక్టుల్లోకి నీళ్లు వస్తాయి. ఇందుకోసం జిల్లాలో 20 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో 47 పూర్తి కొత్త ప్రాజెక్టులకు సర్వే పనులు పూర్తయ్యాయి. డీపీఆర్ కూడా పూర్తయింది. పరిపాలన అనుమతులు రావాలి. ఇక వనపర్తికి 400 బెడ్స్ ఆస్పత్రి భవనం మంజూరైంది. పాత పాలమూరులో రోడ్లు, పంచాయతీరాజ్ భవనాలు, సబ్ స్టేషన్లు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యాప్రమాణాలు పెంచే కాలేజీల ఏర్పాట్లు వంటివి ముఖ్యమంత్రి కేసీఆర్, నీళ్ల మంత్రి హరీశ్ రావు దయవల్ల వనపర్తి జిల్లాకు, పాలమూరుకు ఈ పనులు చేయగలిగాం.

 

3 ప్రశ్న- 2014కు ముందు, 2014 తరువాత సాగువిస్తీర్ణంలో వచ్చిన తేడాలేంటి?

 

తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఉమ్మడి పాలమూరులో జూరాల కింద లక్ష ఎకరాలు, ఆర్డీఎస్ -15 వేల ఎకరాలు, కోయిల్ సాగర్ – 10 వేల ఎకరాలు, కె.ఎల్.ఐ మొదటి లిఫ్ట్ – 13 వేల ఎకరాలు, నెట్టెంపాడు – 15 వేల ఎకరాలు మాత్రమే సాగు అయింది. ఇక తెలంగాణ వచ్చిన తరువాత ఇప్పుడున్నదానికి అదనంగా దశలవారీగా ఆయకట్టు పెంచాం. నెట్టెంపాడు – 2 లకల ఎకరాలు, భీమా – 2 లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ – 40 వేల ఎకరాలు, కె.ఎల్.ఐ – 2.5 లక్షల ఎకరాలు... ఇవన్నీ కలిపితే 7 లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది.

 

వనపర్తి జిల్లాలో గోపాల్ పేట, పెద్దమందాడి, వనపర్తి, గణపురం ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చింది, తెచ్చింది, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు, నిర్మాణాలు అన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే జరిగాయి. గణపురం రిజర్వాయర్ ను 11 నెలల్లోనే పూర్తి చేశాం. బుద్ధారం రిజర్వాయర్ 46 రోజుల్లోనే కట్టాం. ఈ ప్రాజెక్టులకు నీళ్లొస్తున్నాయి. సీఎం దయ, నీళ్ల మంత్రి సహకారం వల్లే ఇవి పూర్తి చేయగలిగాను. ఇవి కాకుండా 70 వేల ఎకరాలకు కొత్తగా నీళ్లిచ్చే మార్గాన్ని తయారు చేశాం.

గణపురం – 25 వేల ఎకరాలు, పెద్దమందాడి – 22 వేల ఎకరాలు, బుద్ధారం – 8 వేల ఎకరాలు, ఎంజే 3 అండ్ ఎంజే 4  12 వేల ఎకరాలు, టీ 5 అండ్ టీ 8   25 వేల ఎకరాలు, భీమా ఫేజ్ 2 ద్వారా 8 గ్రామాలకు నీళ్లిచ్చే మార్గం సిద్ధం చేశాం. 3 మినీ లిఫ్టులు ప్రతిపాదించాను. అవి మంజూరైతే వనపర్తి జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఖాళీగా కనపడదు. అవి అలా ఉండగానే.. అదనపు భరోసాగా ఏదుల రిజర్వాయర్లో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా ప్లాన్ చేశాం. ఏదుల ద్వారా 45 వేల ఎకరాలకు ఎప్పుడైనా వాడుకోవచ్చు. కెఎల్ఐ పని చేయకపోయినా, రిజర్వాయర్లలో నీళ్లు తగ్గినా.. ఏదుల ఆదుకునేలా రెడీ చేశాం. వనపర్తికి 10 టీఎంసీలు ఎప్పుడూ ఉండేలా ముందుచూపుతో చేశాం. దీనివల్ల ఇంకో 100-200 ఏండ్లకు కూడా ఈ ప్రాంతంలో నీళ్లకు ఢోకా ఉండదు.

 


4 ప్రశ్న-  ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ గా రాష్ట్రమంతటికీ ఉపయోగపడే నిర్ణయాలు ఇప్పటివరకు మీరేం తీసుకున్నారు?


 

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే ప్రాజెక్టుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది. అందుకని వ్యవసాయం, దాని అనుబంధ ప్రాజెక్టులను కేసీఆర్ సర్కారు భారీ ఎత్తున టేకప్ చేసింది. 4 ఏళ్లలోనే ప్రాజెక్టులు పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నాం. ఆ విధంగా ప్రాజెక్టులు పూర్తయిపోతే అందుకు సంబంధించిన అవకాశాలు కూడా కల్పించాలి కదా. అందుకని ఆ రంగాల్లో పెద్దఎత్తున పట్టభద్రులు తయారయ్యేలాగా పలు కళాశాలలను ఏర్పాటు చేశాం. వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, ఫిషరీ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, వ్యవసాయ పాలిటెక్నిక్.. వీటి ఏర్పాటుకు ఈ 4 ఏళ్లలోనే ప్రభుత్వం చేత ఆమోదింపజేసుకున్నాం. ఇవి రాష్ట్ర అభివృద్ధిని, సాంకేతిక రంగాన్ని ప్రభావితం చేసే కీలకాంశాలు. అంతేకాకుండా వాగులు, వంకల ద్వారా వచ్చే నీటిని కూడా సద్వినియోగం చేసుకునేందుకు నేను కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వం మందుంచాను. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇర్రిగేషన్ విభాగాల సమన్వయంతో వాగుల మీద కట్టే బ్రిడ్జిలతో పాటు చెక్ డ్యాంలు కూడా విధిగా కట్టాలని అందువల్ల నీళ్లు ఎక్కడికక్కడ అవసరమైనంత మేరకు నిలిచిపోయి భూగర్భ జలాల పెరుగుదులకు తోడ్పడతుంది. మిగిలిన నీళ్లు కిందికి వెళ్లిపోతాయి. నిలువ ఉన్న నీరు స్థానిక అవసరాలకు ఎంతో మేలు చేస్తుంది. నేను ఈ ప్రతిపాదన చేయడంతో దాన్ని ప్రభుత్వం ఆమోదించింది.

 

అట్లే బీసీ రెసిడెన్షియల్ కాలేజీల మీద తొలిసారి ఫైల్ పెట్టింది నేనే. మన దగ్గర బీసీల జనాభా ఎక్కువ. అందుకని బీసీల కోసం వనపర్తిలో రెండు రెసిడెన్షియల్ కళాశాలలు కావాలని ప్రతిపాదించాను. ప్రతిపాదించడమే కాక.. బీసీలకు వీలైనన్ని బీసీ రెసిడెన్షియల్ ఏర్పాటు చేయాలని జస్టిఫికేషన్ కూడా రాసిచ్చాను. ఆ ప్రతిపాదన చాలా బాగుందని ప్రభుత్వం ప్రశంసించింది. ఇంత మంచి ప్రతిపాదనను ఒక్క వనపర్తికే ఎందుకు.. రాష్ట్రమంతటికీ వర్తింపజేద్దామన్నారు. దీంతో నియోకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ కాలేజీ చొప్పున ఆమోదం పొందడానికి నా ప్రతిపాదన తోడ్పడింది. అలాగే వనపర్తికి మహిళా విశ్వవిద్యాలయం కావాలన్న నా ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించింది. ఏర్పాటుకు నిర్ణయం కూడా జరిగిపోయింది.

 

ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలకు తోడు ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు వందల్లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేలల్లో విద్యార్థులు ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని బయటికి వస్తున్నారు. వారు ఆయా కాలేజీల్లో నైపుణ్యం పొంది రిక్రూట్ అయినట్లు ఎక్కడా రుజువు కాలేదు. ఇండియాలోని టాప్ టెన్ ట్రిపుల్ ఐటీల్లో చదివినవారికే ప్లేస్ మెంట్స్ లభిస్తున్నాయి. మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల పరిస్థితేంటి? ఇదిలా ఉంటే ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్ మీద ప్రతి సంవత్సరం రూ. 3 వేల కోట్లు కేటాయిస్తున్నాం. ఇంత డబ్బు వెచ్చించి ఫలితాలు ఏం వస్తున్నాయనేది ప్రశ్న. దీని మీద విస్తారమైన అధ్యయనం జరిగింది. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణకు ఒక ఆర్జీయూకేటీ (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్), బాసరలో మంజూరైంది. కోస్తాంధ్రకు రెండు. అలాంటివే మరో 3 క్యాంపస్ లు తెలంగాణకు కావాలని నేను ప్రతిపాదించాను. మన ప్రభుత్వం అన్నివర్గాల పేదపిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చింది. అక్కడ పాఠశాల విద్య పూర్తి చేసుకున్న విద్యార్థి.. ఆ తరువాత మళ్లీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీకి పోవాల్నా, వీళ్లు ఎక్కడికి పోవాలె.. ఆ తరువాత వాళ్ల పరిస్థితేంటి? మళ్లీ కానిస్టేబుల్, హోంగార్డు ఉద్యోగాల కోసం లైన్లలో నిలబడాల్సి వస్తుంది. అందుకని కేవలం గ్రామీణ విద్యార్థుల కోసమే పైన చెప్పుకున్న ట్రిపుల్ ఐటీలు కావాలని ప్రతిపాదించాను. దీనిద్వారా ఏటా రూ. 3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు చెల్లించే మొత్తంలో 10 శాతం.. అంటే 300 కోట్లు ఖర్చు చేసుకుంటే సంవత్సరానికో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ట్రిపుల్ ఐటీల సంఖ్య పెంచుకుంటే మన రాష్ట్రం నుంచి దిగ్గజాలు తయారవుతారు. బాసర ట్రిపుల్ ఐటీలో చదివిన గ్రామీణ విద్యార్థులను 70 శాతం మందిని నేషనల్, మల్టీ నేషనల్ కంపెనీలు వచ్చి రిక్రూట్ చేసుకుంటున్న విషయం గమనించాలి. మన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అద్భుతమైన సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుంది. ఇది తెలంగాణ విద్యార్థుల దశను మార్చగలదు.

 

మరో ప్రతిపాదన కూడా పెట్టాను. విద్యార్థులు పుస్తకాలు చదవడం వరకే పరిమితం కాకండా ఇతరులపై ఆధారపడే లక్షణాలను తగ్గించడం ఎలా అని ఆలోచించాను. ఇందుకోసం వారిలో వర్క్ కల్చర్ పెంచాలి. అందుకు పరిష్కారంగా వీకెండ్ జాబ్ కల్చర్ ను ప్రమోట్ చేయాలి. షాపులు, హోటల్స్, కార్ఖానాలు, ఎంట్రప్రెన్యూర్స్ ఎవరైనా విధిగా విద్యార్థులకు వారానికి రెండు రోజులు పని కల్పించాలి. అటు విద్యార్థులు కూడా వారానికి రెండు రోజులు లేదా కనీసం 15 గంటలు పని చేసేలా మోటివేట్ చేయాలి. అయితే ఈ నిబంధన షాపులకు కంపల్సరీ. విద్యార్థులకు ఆప్షనల్. కొత్తగా వచ్చే ఎంట్రప్రెన్యూర్స్, షాపుల యజమానులకు ఆ బేసిస్ మీదనే అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి ఇంటర్ నుంచే పని కల్చర్ కు అలవాటు పడతాడు. పని చేస్తుంటే మార్గాలు తెలిసిపోతాయి. సన్మార్గంలో ఉండడానికి అవకాశం ఉంది. హ్యూమన్ రిలేషన్స్ మెరుగవుతాయి. ఇది సామాజికంగా కూడా మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నాం. ఇది ప్రతిపాదనలో ఉంది.

 

అలాగే నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే మరో ప్రతిపాదన కూడా ప్రభుత్వం ముందుంచాను. ఒక వ్యక్తి అనుభవం ద్వారా పని చేసుకోవడం వేరు.. నైపుణ్యంతో పని చేసుకోవడం వేరు. చేస్తూ చేస్తూ ఉంటే వచ్చే అనుభవంతో పని చేయగలడే కానీ.. యాటిట్యూడ్ డెవలప్ కాదు. ఇందుకోసం నైపుణ్యం కావాలి. ఉదాహరణకు ఒక డ్రైవర్ ఉన్నాడనుకుందాం. నెల రోజులు డ్రైవ్ చేస్తే ఎవరికైనా డ్రైవింగ్ వస్తుంది. కానీ.. రోడ్ల మీద డ్రైవ్ చేసేటప్పుడు సామాజిక బాధ్యత ముఖ్యం. యాటిట్యూడ్ ముఖ్యం. ఇది అనుభవంతో వచ్చేది కాదు. కచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇలా నేర్చుకున్నవారు.. తాము సేఫ్ గా ఉండడమే గాక, అంతకన్నా ఎక్కువ ఇతరుల సేఫ్టీ గురించి ఆలోచిస్తారు. అన్ని పనులకూ ఇది వర్తిస్తుంది. మన సమాజంలో ఎవరికీ పట్టని బాధ్యతను, యాటిట్యూడ్ ను నేర్పించేందుకు, గుర్తు చేసేందుకే నైపుణ్య విశ్వవిద్యాలయాల ప్రతిపాదన పెట్టాను. ఏ పనికైనా సిలబస్ సపోర్టెడ్ కోర్స్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతిపాదనలో ఉంది.

 


 

- టి.రమేశ్ బాబు


9032003022


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?