ఆరేళ్ల క్రితం ఏం జరిగిందో.. సరిగ్గా అలాగే కాకపోయినా.. అలాంటిదే రిపీటైంది. వరంగల్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎస్. రాజయ్య ఇంట్లో నాలుగు నిండు ప్రాణాలు అగ్ని కీలలకు ఆహుతైపోతే.. కొత్తగూడెెం జిల్లా పాల్వంచలో అలాంటివే నాలుగు ప్రాణాలు బూడిదైపోయాయి. అక్కడ కాంగ్రెస్ నేత కొడుకు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న భార్యను కట్నం పేరుతో రాచి రంపాన పెట్టి గ్యాస్ సిలిండర్ కుట్రకు బలిపెడితే.. ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే తనయుడు ఆస్తి తగాదాలు పరిష్కరించే నెపంతో ఓ అసహాయుడి అర్థాంగిపై కన్నేసి, హైదరాబాద్ లోని తన గడీకి పంపించుమని ఆర్డరేసి, గడి బయట కట్టుకున్న భర్తనే కాపలాగా ఉంచే నయా కీచక పర్వానికి తెరతీశాడు. అచ్చంగా ఆనాటి గడీల పాలనకు తాజా ఆనవాలుగా నిలిచాడు. భర్తకు విషయం చెప్పలేక, ఆమెను వదిలి తానొక్కడే తన దారి తాను చూసుకోలేక, పిల్లల దారుణ భవిష్యత్ చిత్రాన్ని ఊహించుకోలేక అందరినీ తన వెంటే తీసుకుపోయాడు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు, అందాలొలికే భార్యను కర్కశ మంటల్లో కాల్చేశాడు. తానూ తగులబడిపోయాడు.
కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలో నాగ రామకృష్ణ తన తల్లితో, సోదరితో ఆస్తుల పంపకాల విషయాన్ని తేల్చుకోలేకపోయాడు. దాదాపు రెండేళ్ల క్రితం ప్రపంచమంతా చుట్టేసిన కరోనా దెబ్బతో తాను నడుపుకునే చిన్నపాటి నెట్ సెంటర్ తో జీవనం స్తంభించిపోయింది. రెంట్లు కట్టలేక, కరెంట్ బిల్లులు సైతం వెళ్లక దాదాపు ఏడాదిగా బతుకు దుర్భరంగా మారింది. ఈ క్రమంలో తండ్రి పోగేసిన ఇల్లు, పొలం లాంటి కొద్దిపాటి స్థిరాస్తులే అతనికి దిక్కుగా తోచాయి. వాటిని పంచివ్వుమని తల్లిని అర్థిస్తే... కూతురితో కూడిన తల్లి... కొడుక్కి నయా పైసా పోకుండా కుట్ర పన్నిందని స్థానికులు అంటున్నారు. రామకృష్ణ సోదరి, వనమా రాఘవేంద్ర కలిసి చదువుకున్నారని, ఆ చనువుతోనే సోదరిని "ఇంప్రెస్" చేసేందుకు రాఘవేంద్ర ప్రత్యక్షంగా రంగంలోకి దిగాడని కొత్తగూడెం ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. రియల్ తగాదాల నుంచి కుటుంబ తగాదాలు, ఆస్తుల సెటిల్మెంట్ల వరకు ఎప్పుడో సిద్ధహస్తుడైన రాఘవ ఈ కేసులో మరింత ఇష్టపూర్వకంగా రామకృష్ణను వేధించాడని ఆలస్యంగా వెలుగు చూస్తోంది. ఆ బలంతోనే రామకృష్ణకు చుక్కలు చూపిస్తున్నాడని, కుటుంబ ఆస్తుల తగాదా తెగాలంటే భార్యను పంపించడం మినహా మరో మార్గం లేదని, ఎవ్వరి దగ్గరికి వెళ్లినా, నీ సమస్యకు పరిష్కారం చూపించలేరంటూ రామకృష్ణను ఒంటరివాణ్ని చేశాడు రాఘవ. కబందుడి హస్తాల్లా విస్తరించిన తన రాజకీీయ పలుకుబడిని ఎవరూ ఛేదించలేరని, ఈ పరిస్థితుల్లో నీ పిల్లలు, భార్య బతికి బట్ట కట్టాలంటే నీ భార్యను మించిన వస్తువు మరోటి లేదని పొలిటికల్ విలనీని ప్రదర్శించాడు.
ఈ క్రమంలో ఎవరిని అర్థించాలో తెలియని, ఎవరూ కాపాడలేని తన అసహాయతే ఆ నలుగురు అభాగ్యుల భవిష్యత్తును వెక్కిరించింది. వనమా వారసుడి అరాచకాలను, ఎంతో కాలంగా దగ్గరుండి చూస్తున్న వ్యక్తిగా భార్యా పిల్లలతో కలిసి బలిపీఠం ఎక్కడం మినహా మరో మార్గం లేదని తలపోశాడు. పోతూపోతూ తెలంగాణ ప్రజానీకాన్ని జాగృతం చేసి మరీ పోయాడు. ప్రజలారా.. మీరు కళ్లు తెరవకపోతే ఒళ్లు కాల్చుకోక తప్పదన్న హెచ్చరికలు జారీ చేశాడు. ఆ నలుగురి మృత్యు నాదాలు ఆ విషయాన్ని స్పష్టంగానే చెబుతున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరి పరమైందో కాలిన శవాలే సాక్ష్యం పలుకుతున్నాయి.
నిజమే. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమయోధుడే. అంగీకరిద్దాం. మరి ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి అరాచక శక్తులకు ఎందుకు ఊతమవుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. తెలంగాణలో ప్రతి బిడ్డా ఆత్మగౌరవంతో బతికినప్పుడే బంగారు తెలంగాణ సాధించినట్లు. ఇదే అంశాన్ని అనేక సందర్భాల్లో కేసీఆర్ ఎలుగెత్తి చాటారు. మరి ఆత్మగౌరవానికి పాతరేసే దుష్ట శక్తులకు ఎందుకు ఆశ్రయమిస్తున్నట్లు.. తెలంగాణకు ముందు, తెలంగాణ వచ్చిన కొన్నేళ్ల వరకు ఆయనపై ఉన్న అంచనాలు క్రమంగా ఎందుకు తేలిపోతున్నాయి. తనపై తెలంగాణ ప్రజానీకం పెట్టుకున్న ఆశలు, అంచనాలను ఎంతోకొంత ఆవిష్కరిద్దామన్న ఆలోచన ఆయన ఎందుకు చేయడం లేదు. తాను ఏరికోరి తెచ్చుకున్న నాయకులే తన ప్రతిష్టను మసకబారుస్తుంటే కేసీఆర్ ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నారా.. లేక చూసీ చూడనట్టు వదిలేస్తున్నారా.. ప్రజల్ని రంజింపజేయాలన్న విషయాన్ని కావాలనే విస్మరిస్తున్నారా.. లేక ఒకటో, రెండో పథకాలు సక్సెస్ చేస్తే ఇక మిగతావేవీ జనం పట్టించుకోరన్న మితిమీరిన ధీమా ఆయన్ని నిష్క్రియాపరత్వం వైపు నడిపిస్తోందా...
ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం. వరంగల్ లో ఎస్. రాజయ్య తనకు తానుగా రాజకీయ సమాధి చేసుకున్నట్టే.. కొత్తగూడెంలో వనమా రాజకీయ ప్రస్థానం కూడా ముగిసిపోయిందనే చెప్పాలి. కేసీఆర్ దీన్నో డేంజర్ బెల్ గా భావించి దిద్దుబాటు చర్యలకు ఇకనైనా పూనుకుంటాడని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.
Comments
Post a Comment
Your Comments Please: