భారత్ లో మత స్వేచ్ఛపై ట్రంప్ మాట్లాడతాడట. మత స్వేచ్ఛపై ఏం మాట్లాడతావు? భారత్ లో మత స్వేచ్ఛ ఉందంటావా? లేదంటావా? అమెరికా కన్నా ఎక్కువుందంటావా ? లేక అసల్లేదంటావా ? ఏ దేశంలో అమల్లో ఉన్న మత స్వేచ్ఛను ప్రామాణికంగా తీసుకొని భారత్ లో మతస్వేచ్ఛను కొలుస్తావు బాస్?
పేరులో ఇస్లామిక్ నేచర్ ఉన్నా, వేషధారణలో ఇస్లామిక్ కల్చర్ కనిపించినా భూతద్దం పెట్టి ఒళ్లంతా సెర్చ్ చేసే అమెరికాధీశుడు భారత్ లో మత స్వేచ్ఛ మీద మాట్లాడతాడట. మెక్సికో నుంచి వచ్చే శరణార్థులను అడ్డగించేందుకు నువ్వు ముళ్ల కంచెలు నాటుకుంటావు. అయినా అక్రమ వలసలు వరదలా పారుతుంటే 24 గంటల సెక్యూరిటీని అమలు చేసుకుంటావు. యూరోప్, మధ్య ప్రాచ్య దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా విపరీతమైన ఆంక్షలు పెడతావు.
ఎయిర్ పోర్టుల్లో తలపాగా చుట్టుకున్న సిక్కును చూసినా ముస్లిం పౌరుడేమోనని జడుసుకుంటావు. క్లీన్ షేవ్ తో ఉన్న మా స్మార్ట్ హీరో భారతీయుడు కమల్ హాసన్ ని చూసినా పేరులో హసన్ ధ్వనిస్తుంది కాబట్టి బట్టలు విప్పించి మరీ ముస్లింను కాదని చెప్పేదాకా వదలిపెట్టకుండా.. ఇండియాలో హిందువును అని చెప్పని కమల్ చేత నువ్వు మాత్రం... నేను హిందువునే మొర్రో అని గొంతెత్తి అరిచేలా చేశాక గానీ.. అప్పుడు వదిలిపెట్టవు. నీ దగ్గర పిల్లిలా చేతులు ముడుచుకొని నువ్వు పెట్టిన ప్రతి రూల్ ను కూడా తు.చ. తప్పకుండా పాటించాక.. ఇండియా తిరిగొచ్చిన ఇండియన్ మేధావులు ఇండియాలో మాత్రం ముస్లింలకు ఏదో అన్యాయం జరుగుతుందని ఆత్మవంచన చేసుకుంటే మళ్లీ మీ అమెరికన్ మీడియానే, అగ్రరాజ్యాల మీడియానే ఇండియాలో కొంపలంటుకుపోతే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ లు ఇస్తారు.
ఇంతకీ భారత్ లో మత స్వేచ్ఛ మీద ఏం మాట్లాడుతావు? నీకు బాగా జాన్, జిగర్ అని నువ్వే చెప్పుకునే మా నరేంద్ర మోడీ అచ్చుగుద్దినట్లు నీలాగే చేస్తుంటే చూడాలని ముచ్చట పడుతున్నావా ? లేక నీకన్నా ఇంకో ఆకు ఎక్కువే చదివినట్టు సరిహద్దుల్లో మరింత పటిష్టంగా పర్ఫామెన్స్ చూపించాలని కోరుకుంటున్నావా ? నీకన్నా తక్కువ పర్ఫామెన్స్ చూపిస్తే మత స్వేచ్ఛ విపరీతంగా ఉందని, నీ కన్నా ఎక్కువ ప్రతిభ కనబరిస్తే రూల్స్ కఠినంగా ఉన్నాయని, ఇండియాలో పాకిస్తాన్ జిందాబాద్ అని పలికే బయటి దొంగలకు కొందరు ఇంటిదొంగలు మద్దతిచ్చినా చూసీ చూడనట్టు వదిలేయడమే అసలైన మత స్వేచ్ఛ అని ప్రకటిస్తావా ?
అందుకే ట్రంప్.. ఇప్పటివరకు అనేక దేశాల పౌరులకు, శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన ఇండియా.. ఇవాళ నువ్వు చెప్పే మత స్వేచ్ఛ కొత్తగా ఎలా ఉంటుందో వినాలని తహతహలాడుతున్నారు. చివరికి నా దేశం మీదనే దండెత్తిన సంతతిలో కూడా అక్బర్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. వారిలో లేని సుగుణాలను కూడా వెదికి మరీ గానం చేసి ఆనందబాష్పాలు రాలుస్తూ ఆహా... నా దేశంలో ఐకమత్యం ఎంతగొప్పగా విరాజిల్లుతోంది.. దేశమంటే ఇలా ఉండాలి. ఇలాగే ఉండాలి.. అని రొమ్ములు విరుచుకొని ప్రపంచానికే ఆదర్శం ఇండియా అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నీకు స్వాగతం పలికిన 130 కోట్ల మంది నా దేశ పౌరులు.. నువ్వు కొత్తగా చెప్పే మత స్వేచ్ఛ ఎలా ఉంటుందో వినాలని కోరుకుంటున్నారు. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా ? ప్లీజ్.
Comments
Post a Comment
Your Comments Please: